వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్
సాక్షి, విజయవాడ: గత ఎన్నికల్లో 640 హామీలు ఇచ్చి ఒక్క హామీని సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇక్కడి వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ శాసనసభలో 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై తీర్మానం చేసిన చంద్రబాబు.. మరి ఈ 40ఏళ్లలో తెలుగు వారిని ఎంతగా దగా చేశారన్నది ప్రస్తావించి ఉంటే బావుండేదని పిల్లి సుభాష్ ఎద్దేవా చేశారు. ఇంత అనుభవం ఉండి ఏం లాభం, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
2018 కల్లా గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు ఇస్తామన్న మాటలు ఏమి అయ్యాయి? మంత్రి దేవినేని ఉమ చేసిన సవాల్ ఏమైందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు దుస్థితికి చంద్రబాబే కారణమని, భూ సేకరణ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియదు. కానీ కేంద్రం నుంచి ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి ఎగువన తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తుందని, కానీ పోలవరం నిర్మాణంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వివర్శించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు.
అబద్దాలతోనే చంద్రబాబు పాలన
లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు అబద్దాలతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అందరికీ తెలుసునన్నారు. కానీ గవర్నర్‌తో కూడా అబద్దాలు చెప్పించాల్సిన ఖర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఓ వైపు నిరుద్యోగ భృతి లేకపోగా, మరోవైపు చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఏపీ ప్రజలపై అదనపు భారం పడిందని చెప్పారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, తప్పులు చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాటిని ఎత్తిచూపారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment