బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీకి మకాం మారుస్తారని ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపించింది. కేంద్ర గృహ పట్టణాభివృధ్దిశాఖ నితీష్‌కు ఢిల్లీలో సుందరమైన బంగ్లా కేటాయిండంతో ఇక నితీష్ బిహార్ వదిలి ఢిల్లీకి మకాం మారుస్తారని ఆర్‌జేడీ పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఆర్జేడీ వ్యాఖ్యలను ప్రభుత్వ అధికారులు తీవ్రంగా ఖండించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ముఖ్యమంత్రికి అధికార నివాసాన్ని కల్పించడం కేంద్ర ప్రభుత్వ భాధ్యత అని దానిలో భాగంగానే నితీష్‌కు బంగ్లా కేటాయించినట్టు అధికారులు తెలిపారు. 2001-04 మధ్యకాలంలో నితీష్ కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో అక్బర్ రోడ్‌లో అత్యాధునిక భవనంలో ఉన్న విషయం తెలిసిందే.
గత ఏడాది నితీష్... కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయుతో కూడిన మహాబంధన్ కూటమిని వదిలి ఎన్‌డీఏ కూటమిలో చేరిన నేపథ్యంలో ఆర్‌జేడీ ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో త్వరలో ఆరారియా లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనుండంతో రాజకీయ వాతావరణం వేడేక్కింది. మహాబంధన్ కూటమి నుంచి జేడీయు బయటికి వచ్చిన అనంతరం జరిగే మొదటి ఎన్నికలు ఇవే. కాగా జేడీయు మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను , పార్టీ సీనియర్ నేత ఆలీ అన్వర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో రాజ్యసభ స్థానాలు కోల్పోయారు. అయితే వారు ఏపార్టీకి మద్దతు ఇస్తారో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో జేడీయు జహాన్‌బాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి మిత్రపక్షం బీజేపీని పార్లమెంట్ ,అసెంబ్లీ స్థానంలో బరిలో నిలిపింది. ఈ ఎన్నికలు రెండు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment