
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నక కొద్దీ అధికార బీజేపీ, పూర్వ వైభవం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న పాటిదార్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మోర్బీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మోర్బీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. 'నాకు ఇప్పటికీ గుర్తుంది. గతంలో ఈ మోర్బీ పర్యటనకు వచ్చినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చెడు వాసన వస్తుందంటూ ముక్కు మూసుకున్నారు. ఓ గుడ్డతో ముక్కు మూసుకుని అసౌకర్యంగా ఇందిరా కనిపించే ఫొటో చిత్రలేఖ మ్యాగజైన్‌లో వచ్చింది. ఆ ఘటనను ఎప్పటికీ మరిచిపోలేను. కానీ జన్‌సంఘ్, ఆరెస్సెస్‌లకు మాత్రం ఈ మోర్బీ వీధులు సుగంధాన్ని వెదజల్లుతాయి. మానవత్వపు పరిమాళాలను మా నేతలకు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని' వ్యాఖ్యానించారు.
'కష్టకాలంలోనూ మోర్బీని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. కానీ కాంగ్రెస్ హయాంలో అలాంటి పరిస్థితులు లేవు. గుజరాత్ ఫేమస్ మోడల్స్‌లో మోర్బీ ఒకటి. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 13 ఏళ్ల సమయంలో మోర్బీ అభివృద్ధికి పాటుపడ్డాను. నేనే సీఎం అవకముందు కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో విద్యుత్, నీటికి కటకట ఉండేది. కానీ పలు ప్రాజెక్టులు చేపట్టి మీకు నీటిని అందించిన ఘనత బీజేపీదే. నర్మద నదీ జలాలను గుజరాత్‌కు అందించినా కాంగ్రెస్ మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటోంది. చేతిపంపులు లాంటి మౌలిక వసతులు కల్పించడమే అభివృద్ధి అని కాంగ్రెస్ భావిస్తుందంటూ' మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సౌరాష్ట్రలో మూడు ర్యాలీలు, సూరత్‌లో ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ డిసెంబర్ 9న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.