యోగికి తలంటిన మోదీ | PM Modi Serious on Yogi Adithyanath on Serial Incidents | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 6:28 PM | Last Updated on Wed, Aug 15 2018 2:37 PM

PM Modi Serious on Yogi Adithyanath on Serial Incidents  - Sakshi

లక్నో :  ఉప ఎన్నికల్లో ఓటమి.. దళితులపై దాడులు.. సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు... దీనికి తోడు మహిళపై బీజేపీ ఎమ్మెల్యే ఆత్యాచార ఆరోపణలు. ఇలా నెల తిరగకుండానే జరిగిన వరుస పరిణామాలతో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా యోగిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలను కలిసిన యోగి.. వరుస పరిణామాలపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఎమ్మెల్యే నన్ను రేప్‌ చేశారు)

అయితే వివరణపై సంతృప్తి చెందని మోదీ.. యోగి పాలనపై అసహనం వ్యక్తం చేశారంట. ఈ తరుణంలో పరిస్థితిని సమీక్షించేందుకు స్వయంగా అమిత్‌ షాను రంగంలోకి దించారు. ఏప్రిల్‌ 11న షా లక్నో పర్యటన సందర్భంగా క్షేత్రస్థాయి నేతల నుంచి నివేదికలు తీసుకోబోతున్నారంట. ఈ మేరకు కిందిస్థాయి నేతలకు సమాచారం కూడా అందించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కీలక ప్రాంతాల్లో నాయకత్వం లోపం స్పష్టంగా కనిపించటంతో.. ఆయా ప్రాంతాల్లో ఇన్‌ఛార్జీలపై వేటు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అత్యాచార ఘటనపై స్పందించిన యోగి
యూపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న దళిత మహిళ అత్యాచార కేసుపై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. ‘ఇది ఊహించని ఘటన. బాధితురాలి తండ్రి చనిపోవటం బాధాకరం. లక్నో అదనపు డీజీ ఈ కేసులో స్వయంగా విచారణ జరుపుతున్నారు. తప్పు ఎవరిదైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు’  అని యోగి సోమవారం మీడియాకు వెల్లడించారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగర్‌, ఆయన అనుచరులు ఏడాది క్రితం తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఉన్నావ్‌కు చెందిన ఓ మహిళ.. తన కుటుంబంతో సహా సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది తెలిసిందే. ఆపై ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. లాఠీ దెబ్బలకు ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కుల్‌దీప్‌ సోమవారం సీఎంతో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.  మరోవైపు మహిళా ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు అందులో బీజేపీ ఎమ్మెల్యే పేరును చేర్చకపోవటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement