న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మోదీ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. తీవ్రమైన నిందలు, అపోహలు, అవాస్తవాలను మోదీ ప్రచారం చేస్తున్నారని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ అత్యంత దురుద్దేశపూరిత ఆరోపణలతో ప్రమాదకరమైన ధోరణిని ప్రారంభిస్తున్నారన్నారు. ‘మోదీ అసత్య వ్యాఖ్యలు, అబద్ధపు ప్రచారం చాలా బాధించాయి. ప్రధాని అనవసర అంశాలపై దృష్టి కేంద్రీకరించటాన్ని మానుకుని తన హోదాకు తగ్గ పరిణతి, గౌరవంతో వ్యవహరించాలి. జాతికి క్షమాపణలు చెప్పాలి’ అని మన్మోహన్ డిమాండ్ చేశారు. మణిశంకర్ అయ్యర్ నివాసంలో జరిగిన విందు భేటీలో గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చకు రాలేదని.. కేవలం భారత్–పాకిస్తాన్ సంబంధాలను మాత్రమే చర్చించామని సింగ్ పేర్కొన్నారు.
ముందు మీరు సమాధానం చెప్పాలి
గుజరాత్ ప్రచారంలో భాగంగా ఆదివారం మోదీ ‘గుజరాత్ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. తమ పార్టీ నేతలతో పాక్ అధికారుల సమావేశంపై జాతికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మన్మోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ప్రధాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మహ్మద్ కసూరీ పర్యటన సందర్భంగా అయ్యర్ నివాసంలో విందు సమావేశం ఏర్పాటుచేశారని మన్మోహన్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన నేతల పేర్లనూ ప్రకటనలో సింగ్ వెల్లడించారు.
తనతోపాటుగా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కసూరీ, పాక్ హై కమిషనర్, నట్వర్ సింగ్, కేఎస్ బాజ్‌పాయి, అజయ్ శుక్లా, శరద్ సభర్వాల్, జనరల్ దీపక్ కపూర్, టీసీఏ రాఘవన్, సతీందర్ కే లాంబా, ఎంకే భద్రకుమార్, సీఆర్ ఘారేఖాన్, ప్రేమ్ శంకర్ ఝా, సల్మాన్ హైదర్, రాహుల్ కుశ్వంత్ సింగ్‌లు పాల్గొన్నారని తెలిపారు. వీరెవరిపైనా దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణల్లేవని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. కాగా, ఈ భేటీలో భారత్–పాక్ సంబంధాలపై సాధారణ చర్చ మాత్రమే జరిగిందని.. సమావేశానికి హాజరైన మాజీ దౌత్యవేత్తలు లాంబా, ఘారేఖాన్‌లు తెలిపారు. రాజకీయాలు, గుజరాత్ ఎన్నికల గురించి అస్సలు మాట్లాడుకోలేదని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కపూర్ వెల్లడించారు.
హోదాకు తగ్గట్లు వ్యవహరించండి
‘గుజరాత్ ఎన్నికల్లో ఓటమిపై భయంతోనే ప్రధాని దూషణలకు దిగుతున్నారనేది సుస్పష్టం. బాధాకరం కూడా. మాజీ ప్రధాని, మాజీ ఆర్మీచీఫ్ వంటి రాజ్యాంగపదవులకు కళంకం తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని కానీ, ఓ పార్టీ (బీజేపీ) కానీ కాంగ్రెస్ పార్టీకి జాతీయవాదాన్ని ఉపదేశించాల్సిన అవసరం లేదు’ అని మాజీ ప్రధాని విమర్శించారు. ఉధంపూర్, గురుదాస్‌పూర్ ఉగ్ర ఘటనల తర్వాత ఆహ్వానం లేకుండానే మోదీ పాకిస్తాన్‌లో ఎందుకు పర్యటించాల్సి వచ్చిందో, ఐఎస్‌ఐ (పాక్ గూఢచార సంస్థ)ను భారత వ్యూహాత్మక ఎయిర్‌బేస్ (పఠాన్‌కోట్)లోకి ఎందుకు ఆహ్వానించారో జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు దశాబ్దాలుగా దేశానికి తనేం సేవ చేస్తున్నానో ప్రజలందరికీ తెలుసని మన్మోహన్ పేర్కొన్నారు. అటు గుజరాత్ ఎన్నికల ఫలితాలను ఊహించే మోదీ నిరాశతో మోదీ తన పదవిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను హీనస్థాయికి తెస్తున్నారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు.
పాక్ ప్రతినిధులతో ప్రతిపక్షం భేటీయా?
మోదీ క్షమాపణలు చెప్పాలన్న మన్మోహన్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తోసిపుచ్చారు. జాతిప్రయోజనాలను ధిక్కరించి పాకిస్తాన్ నేతలతో సమావేశం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని మన్మోహన్ సహా కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. అయ్యర్ ఇంట్లో సమావేశాన్ని ‘రాజకీయ దుస్సాహసం’గా అభివర్ణించారు.
పాక్.. నీతులు చెప్పొద్దు: కేంద్రం
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: సొంత శక్తితో ఎన్నికల్లో పోటీ చేయాలి తప్ప.. కుట్రలతో కాదన్న పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. తమ దేశ రాజకీయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలనే ఉద్దేశంతోనే పాక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోందన్నారు. ‘భారతీయులు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికల్లో పాల్గొంటున్నారు. మా దేశ రాజకీయాల్లో పొరుగుదేశం జోక్యం ఆక్షేపణీయం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటంలో పాక్ పాత్ర ప్రపంచానికి తెలుసు. ప్రజాస్వామ్యంపై భారత్‌కు నీతులు చెప్పటాన్ని మానుకోండి’ అని మంత్రి పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో తమ పాత్రపై మోదీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. భారత అంతర్గత రాజకీయాల్లోకి తమను లాగొద్దని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్ ఫైసల్ తెలిపారు.‘ఎన్నికల్లో సొంత బలంతో గెలవాలి గానీ.. కల్పిత కుట్రలతో కాదు. భారత్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం, నిరాధారం’ అని ఆయన ట్వీట్ చేశారు.
మోదీ క్షమాపణ చెప్పాల్సిందే!
Published Tue, Dec 12 2017 2:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment