మేనిఫెస్టో బుక్‌లెట్‌ను చదువుతున్న మోదీ
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తిచేసుకునే 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ కలను సాకారం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ సోమవారం 75 వాగ్దానాలతో లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించింది. 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ఈ లక్ష్యాలన్ని సాధించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపింది. త్వరితగతిన రామమందిర నిర్మాణం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, వచ్చే మూడేళ్లలో రైతుల ఆదాయాన్ని మూడింతలు చేయడం తదితరాలను మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దుచేస్తామని హామీ ఇచ్చింది.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు
సాంస్కృతిక వ్యవహారాలపై..
అయోధ్యలో త్వరితగతిన రామ మందిర నిర్మాణానికి రాజ్యాంగ నిబంధలకు లోబడి అన్ని చర్యలు తీసుకుంటాం. సంప్రదాయాలు, మత విశ్వాసాలకు రాజ్యాంగపర రక్షణ కల్పించేందుకు కృషిచేస్తాం. శబరిమల వివాదంలో మతాచారాలకు సంబంధించిన విషయాల్ని సుప్రీంకోర్టు ముందు సమగ్రంగా అందుబాటులో ఉంచుతాం. ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా రూపకల్పనకు కట్టుబడి ఉన్నాం. అన్ని లిఖిత, అలిఖిత భాషలు, యాసలపై అధ్యయనానికి జాతీయస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేస్తాం.
జమ్మూ కశ్మీర్‌పై..
ఆర్టికల్ 370 రద్దుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. బయటి వారెవరూ కశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధిస్తున్న ఆర్టికల్ 35ఏను కూడా తొలగిస్తాం. ఈ ఆర్టికల్ స్థానికేతరులు, మహిళలపై వివక్షాపూరితంగా ఉంది.
ఆర్థిక వ్యవస్థపై..
2030 నాటికి భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం. 2025 నాటికి మన ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు, 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం.
రక్షణ, భద్రతపై..
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. రక్షణ కొనుగోళ్ల ప్రక్రియను వేగిరం చేస్తాం. దశల వారీగా ఎన్‌ఆర్సీ(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)ని వేర్వేరు ప్రాంతాల్లో అమలు చేస్తాం. రాష్ట్రాల సంస్కృతులు, ఆచారాలను గౌరవిస్తూ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదిస్తాం.
వ్యవసాయంపై..
2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం 2 హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకే అందుతున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని రైతులందరికీ విస్తారిస్తాం. చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ పథకాన్ని తెస్తాం. సకాలంలో చెల్లిస్తే రూ.లక్ష వరకు తీసుకునే రుణాలపై వడ్డీ కట్టనక్కర్లేదు.
గ్రామీణాభివృద్ధిపై..
వచ్చే ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి రూ. 25 లక్షల కోట్లు వెచ్చిస్తాం. సొంతిళ్లు లేని వారికి 2022 నాటికి పక్కా ఇళ్లు ఉండేలా చూస్తాం. 2024 నాటికి ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం.
స్టార్టప్‌లపై..
ఎలాంటి హామీ లేకుండానే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం పొందేలా కొత్త పథకం తెస్తాం. పురుషులు తీసుకునే రుణ మొత్తంలో 50 శాతానికి, మహిళలు పొందే రుణాల్లో 25 శాతానికి ప్రభుత్వమే హామీదారుగా ఉంటుంది. నియంత్రణ సంబంధిత నిబంధనలను సరళీకరించి స్టార్టప్‌ల స్థాపనను సులభతరం చేస్తాం.
మౌలిక రంగంపై..
గ్యాస్ గ్రిడ్లు, వాటర్ గ్రిడ్లు, ఐ–వేస్, ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణం, జాతీయ రహదారుల వెంట కనీస సదుపాయాల కల్పనతో తదుపరి తరం మౌలిక వసతులు నిర్మిస్తాం.
ఇతర హామీలు
► దేశవ్యాప్తంగా కొత్తగా 75 మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల స్థాపన
► ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ
► 2022 నాటికి అన్ని రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ పూర్తి
► స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పలు లాంటి అత్యవసర వైద్య ఉపకరణాలతో ప్రత్యేక జాబితా. వాటి ధరల నిర్ధారణకు ప్రత్యేక విధానం
జాతీయవాదమే స్ఫూర్తి
జాతీయవాద స్ఫూర్తి, సుపరిపాలన అనే మంత్రంతో దేశాన్ని 2047(స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల ఏడాది) నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా మారుస్తామని మోదీ అన్నారు. పౌరులందరికీ ఆత్మ గౌరవం, భద్రత, అభివృద్ధి అందించే శక్తిమంతమైన దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని మేనిఫెస్టో ముందుమాటలో పేర్కొన్నారు. ఐదేళ్ల ఎన్డీయే పాలనలో చారిత్రక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నామని, అన్ని వర్గాలకు న్యాయం చేశామని అమిత్ షా అన్నారు. జాతీయవాదానికి, ఉగ్రవాదంపై శూన్య సహనశీల వైఖరికి బీజేపీ కట్టుబడి ఉందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ తెలిపారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా మేనిఫెస్టో రూపొందించామని జైట్లీ అన్నారు.
370 రద్దుపై కన్నెర్ర
జెండా ఎవరెగరేస్తారో చూస్తా: ఫరూక్
‘370 అధికరణం రద్దు చేస్తామని వాళ్లు మాట్లాడుతున్నారు. అలా మీరు చేస్తే, కశ్మీర్‌లో మీ పాలనకు చట్టబద్ధత లేనట్లే. వారు ఆ పని ఎలా చేస్తారో చేయని వ్వండి. ఇక్కడ జాతీయ జెండా ఎగురవేస్తారో చూస్తా. హృదయాలను కలపండి, ముక్కలు కానివ్వకండి’ అని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
నిప్పుతో ఆడుకోవద్దు: మెహబూబా
ఆర్టికల్ 370 రాష్ట్రాన్ని దేశంతో కలిపే వారధి వంటింది. దానిని తెంపితే రాష్ట్రంపై భారత్‌కు చట్టబద్ధ హక్కు ఉండదు. కశ్మీర్ ఒక బాంబులా ఉంది. దానికి నిప్పు అంటిస్తే అంతటా అంటుకుంటుంది. కశ్మీర్‌తోపాటు భారత్ కూడా మిగలదు’ అని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.
మేనిఫెస్టోపై స్పందనలు
అది వంచనా పత్రం: కాంగ్రెస్
2014లో ఇచ్చిన హామీలనే తాజాగా తన మేనిఫెస్టోలో బీజేపీ చేర్చిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. నిండా అబద్ధాలు, వంచనతో కూడిన మేనిఫెస్టో బదులు క్షమాపణ పత్రం విడుదల చేస్తే బాగుండేదని చురకలు అంటించింది. తమ మేనిఫెస్టోలో న్యాయం ఉంటే, బీజేపీ మేనిఫెస్టోలో అబద్దాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. మేనిఫెస్టోపై బెంగాల్ సీఎం మమతా స్పందిస్తూ ‘మోదీ ప్రధానిగా ఎన్నికైతే అసలైన పౌరులు శరణార్థులుగా మారుతారు’ అని హెచ్చరించారు.
అది బీజేపీ గిమ్మిక్కు: ఎన్‌సీపీ
బీజేపీ మేనిఫెస్టో ఒక జిమ్మిక్కు అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) పేర్కొంది. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయిందీ వెల్లడించాలని ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణం రద్దు, మందిర నిర్మాణం వంటి వాటిపై ఏళ్లుగా చెబుతున్న బీజేపీ ఇప్పటికీ నెరవేర్చలేదు’ అని ఆయన ఎద్దేవా చేశారు.
బీజేపీకి అర్హత లేదు: మాయావతి
ఎన్నికల హామీలను విస్మరించిన బీజేపీ, ప్రధాని మోదీకి తాజాగా మరో మేనిఫెస్టో విడుదల చేసే నైతిక అర్హత లేదని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఇందుకు బదులుగా ఆ పార్టీ గత హామీలు ఏమేరకు అమలయ్యాయో తెలిపే నివేదిక ఇస్తే బాగుండేదన్నారు.
స్వాగతించిన శివసేన
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఎన్‌డీఏ భాగస్వామి పార్టీ శివసేన స్వాగతించింది. మందిరం నిర్మించేందుకు, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment