
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నారో, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారో చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే తీసుకున్నారని, పథకం ప్రకారం దీనికి సమాధి కట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైవీ విమర్శించారు.
నేడు ప్రాజెక్టు సందర్శన : పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించడానికి వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధుల బృందం ఈ నెల 7న (నేడు) క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళుతోందని తెలిపారు. అక్కడి పరిస్థితులపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.
అంబేడ్కర్ భగవద్గీతలాంటి రాజ్యాంగాన్ని అందించారు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భగవద్గీతలాంటి రాజ్యాంగాన్ని ప్రసాదించారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.