డీకే అరుణతో కుమార్తె శృతిరెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకున్న చందంగా రాజకీయనేతలు తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. డాక్టర్ పిల్లలు డాక్టర్.. యాక్టర్ పిల్లలు యాక్టర్ అయిన చందంగా జిల్లాలోని రాజకీయనేతలు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు సిద్ధం చేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైబడి రాజకీయ జీవితంలో ఉన్న నేతలు ఇక తమ వారసులకు పగ్గాలు అప్పగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ అరంగ్రేటం కోసం వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కొందరు నేతల వారసులు రంగంలోకి దిగగా... మరికొందరు కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు.
అందుకు అనుగుణంగా నియోజకవర్గాల్లో మకాం వేస్తూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. స్థానిక పరిస్థితులను, క్యాడర్‌తో కలుపుగోలు వ్యవహారం తదితర వ్యవహారాలన్ని యువ నాయకత్వం కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటూ నేతల వారసులు సిద్ధం కాగా.. నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడే కొత్త స్థానాల నుంచి వారిని రంగంలోకి దింపాలని ప్రస్తుత నేతలు కలలు కంటున్నారు. అయితే, నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు దాదాపు లేవని తెలుస్తుండడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దించాలన్న నేతలు వారి కోసం ప్లాట్‌ఫాం సిద్ధం చేస్తున్నారు.
పోరులో డీకే వారసులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీకే అరుణ కాంగ్రెస్ నేతగా, ప్రజాప్రతినిధిగా చిరపరిచితురాలు. మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఉమ్మడి జిల్లాను తన కనుసన్నల్లో శాసించారు. రాజకీయంగా ఈ ప్రాంతంపై ఉన్న పట్టును చేజారకుండా మరింత ఒడిసిపట్టుకునేందుకు రకరకాల వ్యూహరచనలు చేస్తున్నారు. ఇప్పటికే తన చిన్న కుమార్తె స్నిగ్దారెడ్డిని గద్వాల రాజకీయ తెరపైకి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో గద్వాల నుంచి స్నిగ్దను బరిలో దింపనున్నట్లు వారి సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే మహబూ బ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి తన రెండో కుమార్తె శృతిని బరిలో దింపాలని అరుణ భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానాన్ని ఎంపిక చేసుకునేందుకు ఓ కారణం ఉందట.
డీకే.అరుణ మొదటగా రాజకీయ ప్రస్థానాన్ని మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభించారు. 1996లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తన కూతురును ఇక్కడి నుంచి బరిలో దింపి పాత చరిత్రను తిరగరాయాలని భావి స్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం శృతి హైదరాబాద్‌లోని వ్యాపారాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నా రు. త్వరలోనే పాలమూరు ప్రాంతంలో ఆమె పర్యటనకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. అయితే ఈ స్థానం నుంచి పా ర్టీ సీనియర్‌నేత ఎస్.జైపాల్‌రెడ్డి గతంలో పోటీ చేయడం, ప్రస్తుతం విస్తృతంగా పర్యటిస్తుండడంతో పరిస్థితి ఎలా ఉండ బోతుందనేది ఆసక్తికరంగా మారింది.
మంత్రి జూపల్లి వారసుడు సై..
రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుడు అరుణ్ ఇప్పటికే రాజకీయ తెరపైకి వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భాస్తున్నారు. అందుకు అనుగుణంగా వనపర్తి జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే కేంద్రం అంత సుముఖంగా లేకపోవడంతో నియోజకవర్గాల సంఖ్య పెరిగే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో తాను మంచి స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే కుమారుడికి గ్రాండ్ విక్టరీ అందజేయాలని నిర్ణయించుకున్న మంత్రి జూపల్లికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదే విధంగా దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ, దయాకర్‌రెడ్డి దంపతల పెద్ద కుమారుడు సిద్దార్థరెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని ఆశపడుతున్నారు. అయితే వారు ప్రస్తుతం కొనసాగుతున్న టీడీపీ పరిస్థితి నానాటికి దయనీయంగా మారుతోంది. ప్రస్తుత టీడీపీ ద్వారా కుమారుడిని బరిలో దింపితే ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుమారుడి రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కడ ప్రారంభించాలో అర్థం కాక సతమతమవుతున్నారు.
రంగంలోకి జితేందర్‌రెడ్డి కుమారుడు
మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి మొదటి కుమారుడు సిద్దార్థరెడ్డి సైతం రాజకీయ అరగ్రేటం కోసం ఉవ్విలూరుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆయన తెరపైకి రాకపోయినా వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏదైనా ఒక అసెంబ్లీ స్థానానికి ఒక చోట పోటీకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఒకటి, రెండు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల స్థానాలను మార్పు చేయాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి 2019 ఎన్నికల్లో షాద్‌నగర్ లేదా కొడంగల్ నుంచి పోటీకి దిగే అవకాశమున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా త్వరలో రాజకీయ కార్యాచరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీకెళ్లిన పంచాయితీ..
వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు మంచి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం కోసం నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద పంచాయతీ జరుగుతోంది. ఈ పంచాయతీ పరిష్కారం కోసం కొందరు ఏకంగా ఢిల్లీకి సైతం వెళ్లి నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగైదు పర్యాయాలుగా నాగం జనార్ధన్‌రెడ్డి, కూచుకుల్ల దామో దర్‌రెడ్డి తలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో నాగం మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు పోటీ చేయగా... నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నుంచి తన కుమారుడు శశిధర్‌రెడ్డి బరిలో నిలిపారు. అయితే అనుకున్నంత మేర నియోజకవర్గంపై కుమా రుడు పట్టు సాధించలేదని నాగం మద నపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో నిలవాలని.. ఎలాగైనా గెలిచేందుకు పార్టీ మారాలని యో చిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరితే తన గెలుపు సులువవుతోందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అయి తే ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులుగా తలపడిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ లోని రాకుండా జనార్ధన్‌రెడ్డిని అడ్డు కునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు ఉంటాయని చెబుతూ.. తన కుమారుడు రాజేశ్‌ను బరిలో దింపాలని దామోదర్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాగం కాంగ్రెస్‌లోకి వస్తే తన వారసుడి ఆశలు ఆవిరవుతాయని ఆయన ఆందోళన చెందుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సాధ్యమైనంత వరకు నాగంను అడుకునేందుకు ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారని పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఇలా మొత్తం మీద వారసుల కోసం నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో ఎందరి వారసులు బరిలోకి దిగుతారు.. ఎందరు విజ యం సాధిస్తారన్నది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment