సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని జంగారెడ్డిపల్లిలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలింగ్ బూత్‌ను పరిశీలించడానికి వెళ్లిన ఆయనపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో జంగారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ చెందిన వారే ఈ దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద మరికొన్ని ఘటనలు..
- సిద్దిపేట, గజ్వెల్, మర్కుక్, ములుగు, జగదేవపూర్ మండలాలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్గల్‌లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు నిర్భందించారు.
- గండిపేట మండలం పుప్పులగూడా బాలాజీ నగర్‌లో బీజేపీ-మహాకూటమి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీజేపీ అభ్యర్థులు బద్దం బాల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- నిజామాబాద్‌లోని మోపాల్ మండలం ఎల్లమ్మ కుంటలో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పోలింగ్ కేంద్రం ముందే జరగడం ఆశ్చర్యకరం.
- వరంగల్ రూరల్ ఖానాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది.
- ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం ఇమామ్ నగర్‌లో గ్రామ సమస్యలు పరిష్కరించలేదని గ్రామస్తులు రాస్తారోకో చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment