
సాక్షి, కర్నూల్ : వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేష ప్రజాదరణతో ముందుకు సాగుతోంది. 24వ రోజు కర్నూల్ జిల్లా పత్తికొండలో కొనసాగుతున్న యాత్రకు అపూర్వ స‍్పందన లభిస్తోంది.
రాతన, తుగ్గలి, గిరిగట్ల మీదుగా నేడు మదనంతపురం క్రాస్ వరకు యాత్ర కొనసాగనున్న విషయం తెలిసిందే. ఉదయం పత్తికొండలో యాత్ర ప్రారంభమైన కాసేపటికే ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, పుష్పవాణి, ఎమ్మెల్సీ ఆళ్లనాని, అరకులోయ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు జగన్‌ను కలిశారు. ఆపై బుడగ జంగాలు జన నేతను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. జీవో నంబర్ 144 రద్దు చేయించాలని వైఎస్ జగన్‌ను వారు కోరారు. ఈ విషయమై ఇది వరకే అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని, వైఎస్సాఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని జననేత హామీ ఇచ్చారు.
అనంతరం రాతన గ్రామానికి చేరుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర. అక్కడ ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించిన జగన్ ప్రజలను ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. పాదయాత్రలో భాగంగా మదనంతపురం క్రాస్ లో ప్రజలతో జగన్ మమేకం కానున్నారు.