సాక్షి, కర్నూలు : చంద్రబాబు పాలనకు నాలుగేళ్లు పూర్తయ్యింది. ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు.. మరి ప్రజలు సంతోషంగా ఉన్నారా? అని అడుగుతున్నా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 22వ రోజు ఆలూరు నియోజకవర్గం బిల్లేకల్ వద్ద అశేష జనవాహిని సమక్షంలో వైఎస్ జగన్ ప్రసంగించారు.
వైఎస్ జగన్ ప్రసంగిస్తూ... మాట్లాడితే 12 శాతం అభివృద్ధి పెరిగిందని చంద్రబాబు అంటున్నారు. మరి మీ జీవితాల్లో అది కనిపిస్తుందా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించగా.. లేదు అన్న సమాధానం వినిపించింది. నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ఇదే డ్రామా ఆడుతున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవటంతో అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని జగన్ అన్నారు. ప్రతీ కులాన్ని, మతాన్ని చంద్రబాబు దారుణంగా మోసం చేశారన్నారు. ఇలాంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకుందామా? అని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘రైతన్నలు గిట్టుబాటు ధర లభించక కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల గడపలు తొక్కే ప్రసక్తే లేదు. శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ, మనకు అందటం లేదు. రేషన్ షాపుల్లో సరుకులు లేవు. పైగా విద్యుత్ బిల్లులు పెంచారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మచ్చుకైనా కనిపించటం లేదు. మోడల్ స్కూళ్లలో టీచర్లకు ఆరు నెలలుగా జీతాల్లేవు. నారాయణ స్కూళ్లపై ఉన్న శ్రద్ధ.. ప్రభుత్వ పాఠశాలలపై చూపించరు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. నాలుగేళ్లలో 15 లక్షల పెట్టుబడులు వచ్చాయని అంటున్నారు. కానీ, ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. అది నెరవేరకపోవటంతో ప్రతీ ఇంటికి చంద్రబాబు రూ. 96 వేలు బాకీ పడినట్లయ్యింది. పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేస్తానని ఇంతదాకా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు వెనక్కి చూస్తే అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. తర్వాత ఓ కెరటం పుట్టింది. అది 67 మంది ఎమ్మెల్యేలను, 9 మంది ఎంపీలను చేసింది. చట్టాలను ఖూనీ చేసే పరిస్థితుల్లో రాజకీయాలు ఉంటే.. ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ల సొమ్ముతో ఏం చేయాలో అర్థంకాక చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. రాజకీయాలను మేనేజ్ చేయటంలో నీచమైన వ్యక్తి చంద్రబాబే. ప్రత్యేక హోదా కావాలని గట్టిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడగలేని పరిస్థితి చంద్రబాబుది.
బీసీలకు న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు. కురుమ, బోయలను ఎస్టీల్లో చేరుస్తామన్నారు. ఏ సామాజిక వర్గాన్ని వదలకుండా అందరినీ మోసం చేశారు. అబద్ధాలు, మోసాలతోనే చంద్రబాబు పాలన కొనసాగుతోంది. జన్మభూమి కమిటీలు లంచాలు, అవినీతి అడ్డాలుగా మారాయి. ఉపాధిహామీ డబ్బులను పందికొక్కుల మాదిరి దోచుకు తింటున్నారు. నా ఈ పోరాటం రైతులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, అవ్వా తాతల కోసమే. వాళ్ల సంక్షేమం కోసమే పాదయాత్ర చేస్తున్నా.. నవరత్నాలను ప్రకటించి పాదయాత్ర మొదలుపెట్టా.. అండగా ఉండాలని కోరుతున్నా ఆశీర్వదించండి’.. అని వైఎస్ జగన్ కోరుతూ ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment