న్యూఢిల్లీ : యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న గోపాల్ కందను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం బీజేపీకి తగదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చురకలు అంటించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే బీజేపీ నేతలను భారత నారీమణులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన విషయం తెలిసిందే. అయితే హరియాణాలో హంగ్ ఏర్పడటంతో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు స్థానిక జేజేపీతో పాటు స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదిపి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. దీంతో మరోసారి హరియాణాలో బీజేపీ సర్కారు కొలువుదీరనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రంగంలో దిగినప్పటికీ చేదు ఫలితం ఎదురుకావడంతో పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి.
ఈ నేపథ్యంలో అధికారం కోసం బీజేపీ నేరస్తులను సైతం ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తోందని ప్రియాంక విమర్శించారు. ఎమ్మెల్యే గోపాల్ కందను ఉద్దేశించి ట్విటర్‌లో బీజేపీ తీరును విమర్శించారు. ఈ మేరకు... ‘ తొలుత కుల్దీప్ సెంగార్, తర్వాత చిన్మయానంద్.. ఇప్పుడు గోపాల్ కందా.... ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారతీయ మహిళ బీజేపీని, బీజేపీ నాయకులను బహిష్కరించాలి. ఇకపై వారెన్నడూ మహిళల గౌరవం గురించి మాట్లాడే ధైర్యం చేయకుండా బుద్ధి చెప్పాలి’ అని మహిళలకు విఙ్ఞప్తి చేశారు. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ నేత కుల్దీప్ సెంగార్(తర్వాత పార్టీ నుంచి తొలగించారు) ప్రధాన నిందితుడన్న విషయం తెలిసిందే. అదే విధంగా చిన్మయానంద్ సైతం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇక హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భూపీందర్ సింగ్ హుడా కేబినెట్‌లో గోపాల్ కంద మంత్రిగా ఉండేవారు. అయితే గోపాల్ కందా వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ... ఆయన నిర్వహిస్తున్న ఏవియేషన్ కంపెనీలో పనిచేస్తున్న గీతిక శర్మ అనే ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ గోపాల్‌ను టార్గెట్ చేసి కేబినెట్ నుంచి వైదొలిగేలా చేసింది. అయితే ప్రస్తుతం హంగ్ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకే లోక్‌హిత్ పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందిన గోపాల్ కంద మద్దతు తీసుకుంది. కాగా ఈ విషయంపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘గోపాల్ కందా నిర్దోషా లేదా అమాయకుడా అన్న విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. అయితే అధికారం చేపట్టే క్రమంలో నైతిక విలువలు కోల్పోవడం మంచిది కాదు. అయినా ఓ నిందితుడు ఎన్నికల్లో గెలుపొందినంత మాత్రాన అతడు సచ్ఛీలుడు కాలేడు అని ఆమె ట్వీట్ చేశారు.
First Kuldip Sengar, then Chinmayanand, now Gopal Kanda....every self respecting Indian woman should boycott the BJP and its leaders if they EVER dare to speak of respecting women again.#SayNoToKanda
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 25, 2019
Comments
Please login to add a commentAdd a comment