
సాక్షి, కడప: రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున ఉద్యమిస్తున్న వైఎస్సార్ సీపీని తట్టుకోలేకే సీఎం చంద్రబాబు సంతలో పశువుల మాదిరిగా కొనుగోళ్లకు పాల్పడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలనే డిమాండ్‌తో మంగళవారం ఉదయం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట 36 గంటల నిరాహారదీక్షను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ పక్కా గృహాల పేరుతో ప్రభుత్వం పక్కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విమర్శించారు.
ప్రొద్దుటూరులో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రజల హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే రాచమల్లు ప్రకటించారు. ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తే దాదాపు 4 వేల మందికి పంపిణీ చేసేందుకు రూ.8 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. పేదల కోసం సగం ఖర్చు భరించేందుకు ముందుకు రావాలని ప్రొద్దుటూరు టీడీపీ నేత వరదరాజులురెడ్డికి సూచించారు.
నీచ రాజకీయాలకు తెరలేపుతున్న చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పేదలకు సేవ చేస్తానని రాచమల్లు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు ప్రజల నీళ్ల కోసం ధర్నా చేస్తే తనపై మూడు కేసులు పెట్టారని చెప్పారు. తనపై కేసులు పెట్టిన పోలీసులు, వాదిస్తున్న న్యాయవాదులకు కూడా నీళ్లు అవసరమేనన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషా తదితరులు మంగళవారం సాయంత్రం దీక్ష చేస్తున్న రాచమల్లును కలిసి సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment