
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా యువతకు ప్రాధాన్యం ఇస్తానని ఆయన ప్లీనరీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ కీలక పదవుల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇది కూడా చదవండి.. తొలి వికెట్ డౌన్
ఈ క్రమంలో 35 ఏళ్ల అమిత్ చవ్డా కు గుజరాత్ పీసీసీ బాధ్యతలను అప్పజెప్పారు. మంగళవారం ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అంక్లావ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అమిత్ చవ్డాను జీపీసీసీ అధ‍్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. గుజరాత్ ఓటమి తర్వాత సీనియర్ నేత భరత్ సోలంకి జీపీసీసీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. అయితే రాహుల్.. వేచి చూడాలన్న ఆదేశాలతో ఆయన వెనక్కి తగ్గారు. ఇక కొప్పుల రాజు స్థానంలో ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా నితిన్ రౌత్‌ను నియమించారు.
ఇదే తరహాలో మిగతా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల మార్పు కూడా ఉండబోతోందని, యువ నాయకత్వానికి పార్టీలో ప్రాధాన్యం దక్కబోతోందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకంతో అనూహ్య మార్పులు తథ్యమని రాహుల్ సంకేతాలు పంపినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు తమను తొలగించకముందే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నారు.