అధ్యక్షుడిగా మొదటి స్పీచ్‌.. మోదీపై నిప్పుల వర్షం! | rahul gandhi fires on pm modi | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 16 2017 1:16 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

rahul gandhi fires on pm modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రాజకీయాల పట్ల కొంత విముఖత ఉన్నట్టు కనిపించిన రాహుల్‌గాంధీ ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. శనివారం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన లాంఛనంగా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్‌ ముళ్లపల్లి రామచంద్రన్‌ నుంచి అధికారిక సర్టిఫికెట్‌ను ఆయన స్వీకరించారు. సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోదరి ప్రియాంకగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం రాహుల్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

దేశమంతటా బీజేపీ ప్రభుత్వం హింసాగ్ని రాజేస్తున్నదని మండిపడ్డారు. దానిని ఆర్పివేయడం అంత సాధ్యం కాదన్నారు. దేశ సామరస్యాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించింది. కానీ ప్రధానమంత్రి దేశాన్ని మధ్యయుగాలనాటికి తీసుకుపోతున్నారు. సామరస్యం లేకపోయినా ఏమీ కాదన్న భావనను బలవంతంగా రుద్దుతున్నారు. ఒక్క వ్యక్తి వ్యక్తిగత ప్రతిష్ట కోసం నైపుణ్యాన్ని, అనుభవాన్ని, జ్ఞానాన్ని అన్నింటిని పక్కనబెడుతున్నారు’ అని రాహుల్‌ అన్నారు. దేశాన్ని ముందుకుతీసుకుపోవడానికి బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే కానీ, బీజేపీ నమ్మే విలువలతో తాను ఏకీభవించలేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ దేశంలో ఆగ్రహావేశపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తున్నదని, దీనిపై పోరాడే సత్తా కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నేతలకు మాత్రమే ఉన్నదని అన్నారు.

ఇంకా రాహుల్‌ ఏమన్నారంటే..

  • 13 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చా!
  • ప్రజల కోసం రాజకీయాలు చేయాలి. కానీ నేడు ప్రజల కోసం కాదు వారిన్ని తొక్కేసేందుకు రాజకీయాలు చేస్తున్నారు.
  • నేటి రాజకీయాల్లో సత్యం, దయ రెండూ కనుమరుగు అయ్యాయి.
  • పేదల గురించి మేం మాట్లాడితే మాపై ఎదురుదాడి చేస్తున్నారు
  • ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి చిత్తశుద్ధి లేదు
  • బీజేపీ  హింసాగ్నిని ప్రోత్సహిస్తోంది
  • హింసాగ్ని ఆర్పేయడం అంత సులువు కాదు
  • వాళ్లు కూల్చేస్తారు. మేం నిర్మిస్తాం
  • వాళ్లు దాడులు చేస్తారు. మేం ప్రేమిస్తాం
  • కాంగ్రెస్‌ కార్యకర్తలంతా మా కుటుంబసభ్యులే
  • యువత అంతా కాంగ్రెస్‌లోకి రావాలి
  • దేశాన్ని దెబ్బతీసే వాళ్లను ఓడించి గుణపాఠం చెప్పాలి
  • రానున్న రోజుల్లో ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుంది
  • విద్వేష విధానాల ద్వారా సాధించేదేమీ లేదు
  • పెద్దలు సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ నుంచి చాలా నేర్చుకున్నా

మొదటి ప్రసంగంలోనే మోదీపై నిప్పుల వర్షం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement