న్యూఢిల్లీ: గాల్వన్ లోయ ఘటనపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మౌనం వహించడాన్ని మంగళవారం ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దేశ ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. చైనాతో ఘర్షణల్లో భారత సైన్యం అమరులు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలంది. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగం గురించి తన బాధను వ్యక్తం చేసేందుకు మాటలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించి అన్ని వివరాలను వారితో పంచుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.
ఏప్రిల్ నుంచే చైనా లద్దాఖ్‌లో దుందుడుకుగా వ్యవహరిస్తున్నా.. మోదీ ప్రభుత్వం చూస్తు కూర్చుందని మండిపడ్డారు. చైనా చర్యను తీవ్రంగా తీసుకుని సరైన రీతిలో స్పందించాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కోరారు. చర్చల ద్వారా ప్రస్తుత ప్రతిష్టంభన తొలగుతుందని తాము విశ్వసిస్తున్నట్లు సీపీఐ పేర్కొంది. 20 మంది సైనికులను చైనా చంపేసిందంటే లద్దాఖ్‌లో సరిహద్దుల వద్ద పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశ భౌగోళిక సమగ్రతపై రాజీ లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment