
సాక్షి, అనంతపురం : జనసేన నాయకుడు సాకే పవన్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనంతపురంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సాకే పవన్‌కుమార్.. పవన్ కల్యాణ్ ఆదేశిస్తే వైఎస్సార్‌సీపీ నేతల తలలు నరుకుతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రెచ్చగొట్టే విధంగా సాకే పవన్‌కుమార్ ప్రసంగం సాగింది. అయితే సాకే పవన్‌కుమార్ ప్రసంగిస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ముసిముసి నవ్వులు నవ్వారు.
అయితే జనసేన నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాకే పవన్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు జనసేన హింసా రాజకీయాలకు నిరసనగా ఎస్కే యూనివర్సిటీలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు ఆందోళన చేపట్టారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.