టీఆర్‌ఎస్‌లో రెబల్స్‌ బెడద | Rebels in TRS Party Medchal | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో రెబల్స్‌ బెడద

Published Thu, Apr 25 2019 7:52 AM | Last Updated on Thu, Apr 25 2019 7:52 AM

Rebels in TRS Party Medchal - Sakshi

టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తున్న బైరురాములుగౌడ్‌

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: ఈ మండల పరిషత్‌ ఎన్నికలు జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి.  జిల్లా పరిధిలో ఐదు మండలా లు ఉండగా, ఈ ఐదూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్‌ నియోజకవర్గంలోనే ఉన్నాయి. మొదటి దశలోనే మే 6న తేదీన పోలింగ్‌ జరగనుంది. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యత సీఎం కేసీఆర్‌ మంత్రి మల్లారెడ్డికి అప్పగించారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో కొంత గందరగోళం చోటుచేసుకుందని, ఈ కారణంగానే  రెబల్స్‌ తప్పడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.  ఐదు జెడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో లక్షలాది రూపాయలు డిపాజిట్‌ చేసిన వారికే ప్రాధాన్యం కల్పించారనే భావన మండలస్థాయి నేతల్లో ఉంది.రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిపాజిట్‌ చేయటమో లేదా చూపించటమో ..చేసిన వారికి మాత్రమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు కేటాయించినట్లు  చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలతోపాటు పలు ఎంపీటీసీ స్థానాల్లో టికెట్‌ కేటాయించిన వారే కాకుండా ఇతర నాయకులు కూడా పార్టీ రెబల్స్‌గా  నామినేషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది.

జెడ్పీటీసీ స్థానాల్లో ఇలా....
ఘట్‌కేసర్‌ టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కుమారుడు మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డికి  టికెట్‌ కేటాయించగా,  రెబల్‌గా చౌదరిగూడకు చెందిన బైరు రాములుగౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.  
మేడ్చల్‌ జెడ్పీటీసీ అభ్యర్థిగా  శైలజారెడ్డికి పార్టీ టికెట్‌ ఇవ్వగా, రెబల్‌గా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌ సతీమణి అనితాయాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.
కీసర జెడ్పీటీసీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బెస్త వెంకటేష్‌ నామినేషన్‌ వేయగా, రెబల్‌గా కీసర సర్పంచి భర్త నాయకుపు వెంకటేష్‌ ముదిరాజ్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు.  
మూడుచింతలపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా మద్దుల శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నుంచి నామినేషన్‌ వేయగా, రెబల్‌గా రామిగి మధుకర్‌రెడ్డి, వంగాలక్ష్మారెడ్డిలు  నామినేషన్‌ వేశారు.

ఎంపీటీసీ స్థానాల్లో అంతే...
ఘట్‌కేసర్‌ మండల పరిధిలో ఎదులాబాద్‌ 2వ ఎంపీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంకం రవికి రెబల్‌గా బద్దం వెంకటేశ్, చౌదరిగూడ– 2లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సందీప్‌రెడ్డికి రెబల్‌గా బైరు రాములుగౌడ్, చౌదరిగూడ– 1 ఎంపీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  వేణుగోపాల్‌కు రెబల్‌గా నిరుడి రామారావు, బైరు లక్ష్మణ్‌గౌడ్‌ నామినేషన్లు దాఖలు చేశారు.
కాచవానిసింగారం– 1 ఎంపీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వర్కల లక్షమ్మకు రెబల్‌గా మునికుంట్ల స్వర్ణలత నామినేషన్‌ వేశారు.
కీసర మండల పరిధిలోని కీసర గ్రామంలో 1వ ఎంపీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జంగయ్యయాదవ్‌కు రెబల్‌గా  నారాయణ శర్మ , 2వ ఎంపీటీసీ స్థానంలో పార్టీ అభ్యర్థి మల్లారెడ్డికి రెబల్‌గా రమేష్‌గుప్తా, సతీష్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.
అంకిరెడ్డి పల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.  
శామీర్‌పేట్‌ మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఒకచోట రెబల్‌ బెడద ఉంది  
మేడ్చల్‌ మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, తొమ్మిదింటిలో రెబల్స్‌ బెడద ఉంది.  

ముగిసిన నామినేషన్ల పర్వం
సాక్షి,మేడ్చల్‌ జిల్లా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మేడ్చల్‌ జిల్లాలో ఐదు జెడ్పీటీసీ స్థానాలకు 34 మంది అభ్యర్థుల నుంచి 44 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో ఇండిపెండెంట్‌ అభ్యర్థుల నామినేషన్లు  ఎనమిది ఉన్నాయి. 42 ఎంపీటీసీ స్థానాలకు 193మంది అభ్యర్థులు 279 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 92 మంది ఉన్నారు.  చివరి జెన జెడ్పీటీసీ స్థానాలకు 38 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 218 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement