
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం గురువారం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్సీ, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ సమావేశంలో రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జెడ్పీ సమావేశం వేదికగా నిలదీశారు.
దీంతో సహనం కోల్పోయిన రెడ్డి సుబ్రహ్మణ్యం దుర్భాషలాడుతూ ఎమ్మెల్యేపై నేమ్ ప్లేట్, వాటర్ బాటిళ్లను విసిరేశారు. ఈ ఘటనతో సమావేశంలో మిగిలిన వారందరూ నిశ్చేష్టులు అయ్యారు. జగ్గిరెడ్డి ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.
కాగా, వివాదంతో చైర్మన్ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేపై దాడికి దిగిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తీరును వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment