రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ! | Reservation is here to stay, let there be no doubt about it | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై అనుమానాలొద్దు!

Published Sun, Aug 12 2018 4:17 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

Reservation is here to stay, let there be no doubt about it - Sakshi

స్నాతకోత్సవంలో మోదీ

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. అంబేడ్కర్‌ కలలుగన్న సమాజాన్ని నిర్మించేంతవరకు రిజర్వేషన్లు తొలగించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొదన్నారు. జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) విషయంలో విపక్షాలు ఆత్మరక్షణలో పడే ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాధి కల్పన, జీఎస్టీ, ఎన్నార్సీ, మహిళా సాధికారత, భారత్‌–పాక్‌ సంబంధాలు తదితర అంశాలపై మోదీ మాట్లాడారు.

ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..  
► దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. రోడ్లు, రైల్వే లైన్లు, సోలార్‌ పార్కులు తదతర మౌలికవసతుల ప్రాజెక్టులు వేగగతిన రూపుదిద్దుకుంటున్నాయి. వీటి ద్వారా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సానుకూల ప్రభావం ఉద్యోగ కల్పన రూపంలో కనబడుతుంది.

► గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ రూపొందించిన జీఎస్టీని వ్యతిరేకించాననడం అర్థరహితం. అప్పుటి ఆర్థిక మంత్రి (పి.చిదంబరం) రాష్ట్రాల సమస్యలను వినేందుకు విముఖత చూపారు. మేం రాష్ట్రాల అభిప్రాయాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తెచ్చాం. తమ చుట్టూ దోపిడీ ముఠాను పెట్టుకున్న వారే జీఎస్టీని గబ్బర్‌ టాక్స్‌ అంటున్నారు.
► సుప్రీంతీర్పు ఆదేశాలతో రూపొందిన ఎన్నార్సీని వ్యతిరేకించడంలో అర్థం లేదు. తమపై తమకు, ఉన్నత రాజ్యాంగ సంస్థలపై నమ్మకం లేనివారంతా ఆత్మరక్షణలో పడి ఈ ఆరోపణలు చేస్తున్నారు. 2005లో పార్లమెంటులో తనేం చెప్పారో మమత గుర్తుతెచ్చుకోవాలి. ఎన్నార్సీపై కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోంది.  
► దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకోన్మాద ఘటనలు, మహిళలపై నేరాలు బాధాకరం. కానీ ఈ ఘటనలపై  కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టకరం. మహిళలపై నేరాలు, మూకోన్మాద చర్యల విషయంలో కఠినమైన చట్టాలు తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.  
► మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశ ప్రగతినీ ఊహించలేం. అందుకే మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. చాలా పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం.  
► అంబేడ్కర్‌ కలలుగన్న రాజ్యాంగ లక్ష్యాలను ఇంకా చేరుకోలేదు. రిజర్వేషన్లు లేకుండా ఈ లక్ష్యాలను చేరుకోలేం. రిజర్వేషన్లపై ఎవరికీ అనుమానాలొద్దు. అంబేడ్కర్‌ ఆశయాల సాధనలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. సబ్‌కాసాథ్, సబ్‌కా వికాస్‌ మా నినాదం. బీజేపీ రిజర్వేషన్లు రద్దుచేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అసత్య ప్రచారాలే. వీటిని నమ్మొద్దు.  
► జమ్మూకశ్మీర్‌లో సుస్థిర ప్రభుత్వం మా అభిమతం. ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఉన్నంతవరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. తర్వాతే ఇబ్బందులు మొదలయ్యాయి.
► మా ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతోందనే విషషయం విపక్ష పార్టీలకు బాగా అర్థమైంది. అందుకే వారిపై వారికి నమ్మకం లేక అంతా కలిసి మాపై పోరాటానికి సిద్ధమయ్యారు. వీరు కుటుంబ పాలన, అవినీతిలో ఒకరిని మరొకరు మించిపోయారు. ఇప్పుడు ప్రజలు ఓటేయరని తెలిసి.. అనవసర అంశాలను వివాదం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు.
► పొరుగుదేశాలతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటానని చాలాసార్లు చెప్పాను. ఈ దిశగా మేం చాలా చర్యలు తీసుకున్నాం. పాక్‌ కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను నేను అభినందించాను. సుస్థిర, ఉగ్రవాద రహిత పాకిస్తాన్‌ ఏర్పాటుకు మా సహకారం ఉంటుంది.  


యువ మస్తిష్కాలే సృజన కేంద్రాలు
న్యూఢిల్లీ: గొప్ప ఆలోచనలు ప్రభుత్వ కార్యాలయాల్లోనో, విలాసవంతమైన భవంతుల్లోనో పుట్టవని, యువ మస్తిష్కాల్లోనే చిగురిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసిన ఐఐటీలు మార్పునకు చోదకశక్తులుగా వెలుగొందుతున్నాయని కొనియాడారు. సృజన, అంకుర పరిశ్రమలే దేశాభివృద్ధికి మూల స్తంభాలని పేర్కొన్నారు. వినూత్నత, సృజనశీల దృక్పథాన్ని అలవరచుకోని సమాజాలు పురోగమించవని హెచ్చరించారు. శనివారం ఐఐటీ బాంబే క్యాంపస్‌లో జరిగిన 56వ స్నాతకోత్సవంలో మోదీ ప్రసంగించారు. ఐఐటీల వంటి విశిష్ట విద్యా సంస్థల్లో నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని మేధావులు, విద్యావేత్తలను కోరారు. ఈ సందర్భంగా ఐఐటీ బాంబేకు మోదీ రూ.వేయి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.

ఐఐటీలు సాధించిన ఘనతలను ప్రశంసించిన మోదీ..దేశవ్యాప్తంగా ఎక్కువగా ఇంజినీరింగ్‌ కళాశాలలు స్థాపించడానికి ఐఐటీల విజయాలే స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ‘నేడు ఐఐటీలంటే కేవలం సాంకేతిక విద్యను నేర్పించే విద్యాలయాలే కాదు. దేశంలో మార్పును తీసుకొచ్చే సాధనాలుగా కూడా ఎదిగాయి. ప్రపంచవ్యాప్తంగా దేశానికి బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించాయి. ఐఐటీ గ్రాడ్యుయేట్లు నడిపిస్తున్న స్టార్టప్‌లే దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరించడంలో ముందున్నాయి. గొప్ప ఆలోచనలు ప్రభుత్వ కార్యాలయాల నుంచో, విలాసవంతమైన భవనాల నుంచో రావు. మీలాంటి యువ మెదళ్లలోనే అవి పుడతాయి’ అని మోదీ అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement