
విజయవాడ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారినప్పుడే రాజీనామాను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపినట్టు తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. స్పీకర్ ఆమోదించకుంటే తామేమి చేయగలమని అన్నారు. తాము రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేయడం తమకు సమస్యేనని ఒప్పుకున్నారు.
ఎన్నికలు అనవసరమని రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజీనామాలు ఆమోదించమని స్పీకర్‌ను ఒత్తిడి చేయలేం కదా అని అన్నారు. మంత్రి ఆది వ్యాఖ్యలతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంకటంలో పడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిజంగానే రాజీనామా చేశారా, వీటిని స్పీకర్ ఎందుకు ఆమోదించలేదన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. కాగా, మంత్రి ఆది వ్యాఖ్యలపై స్పీకర్ ఇంకా స్పందించలేదు.