సోమవారం రైతులతో మాట్లాడుతున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అకాల వర్షంతో పంట నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి రూ. 20 వేల పరిహారం చెల్లించి, పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి రైతులకు ఇస్తామన్న ఎకరానికి రూ. 4 వేలు ఈ సీజన్ నుంచే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్, ఇతర నాయకులతో కలసి శ్రీకాంత్‌రెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్, నుస్తులాపూర్‌లలో అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. పంట నష్టం, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ పంటలు వేసి అప్పుల పాలయ్యామని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట నష్టపోయి రైతులకు ఎకరానికి రూ. 20 వేల పరిహారం, పత్తికి గిట్టుబాటు ధర క్వింటాల్‌కు రూ.5,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా మార్కెట్ యార్డుకు వెళ్లి పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. పత్తికి మద్దతు ధర లభించడం లేదని, రూ.2,000 నుంచి రూ.3,000 కంటే ఎక్కువ ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులతో కలసి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మార్కెట్ అధికారులను నిలదీశారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోగూరి నర్సింçహారెడ్డి ఆందోళన చేస్తున్న రైతులు, నాయకుల వద్దకు రాగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.
రైతులను ఆత్మహత్యల దిశగా మళ్లించవద్దని కోరారు. కరీంనగర్ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని తెలిపారు. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన పత్తి కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 200 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు సగం కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మొక్కజొన్న, వరి, సోయా, మిర్చితోపాటు పత్తికి పంటలు దేనికి ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లరెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్.రవి, రాష్ట్ర కార్యదర్శులు బి.బ్రహ్మానందరెడ్డి, వి.గోపాలకృష్ణ, వనమాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment