హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, వెల్లాల తదితరులు
సాక్షి, హైదరాబాద్: అభిమానులు, కార్యకర్తల హర్షాతిరేకాలు... వైఎస్సార్ అమర్ రహే... జగనన్న జిందాబాద్... అన్న నినాదాల మధ్య సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లో ‘వాక్ విత్ జగనన్న’కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వరకు పాదయాత్ర జరిగింది. సోమవారం ఉదయం పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం యాత్ర ప్రారంభించారు.
ఈ సందర్బంగా గట్టు మాట్లాడుతూ రైతులు, కర్షకులు, కార్మికులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాల ఆదరణ, అంతులేని ప్రేమతో అలుపెరగకుండా ముందుకు సాగుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర 1,000 కిలోమీటర్ల మైలురాయి దాటడం తెలుగు రాష్ట్రాల్లో ఒక అపురూప ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో అరాచకాలు సాగిస్తున్న చంద్రబాబు పాలనను అంతం చేసే దిశగా సాగుతున్న పాదయాత్రకు జనం నీరాజనం పట్టడం సంతోషదాయకమన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతివ్వాలి: వాసిరెడ్డి పద్మ
చంద్రబాబు దుష్ట పాలనకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న పార్టీ అధినేత జగనన్నకు సంపూర్ణ మద్దతు అందించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేత మతీన్, గ్రేటర్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కె. విశ్వనాథచారి, నాయకులు అవినాష్ గౌడ్, బత్తుల నాని సహా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment