సాక్షి, గుంటూరు : నగరంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభకు తరలివచ్చిన అభిమానులు కొందరు బారికేడ్లు తోసేసి మరీ సభా ప్రాంగణం ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన బౌన్సర్లు కర్రలతో కార్యకర్తలపై దాడులు చేశారు. అయినా కార్యకర్తలు వెనుకకు తగ్గలేదు. వారు కుర్చీలతో ప్రతి దాడులకు దిగారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని.. తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులసు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు.
అదుపు తప్పిన పరిస్థితి..
సభా ప్రాంగణం దగ్గరకు రావాలని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను దగ్గరగా చూడాలని అభిమానులు ప్రయత్నించడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు కనిపిస్తోంది. కొందరు కార్యకర్తలు దురుసుగా ముందుకు తోసుకురావడంతో మొదటవారిపై బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ కర్రలతో దాడి చేశారు. పోలీసులు కూడా పవన్ అభిమానుల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బౌన్సర్లు, పోలీసులపై అభిమానులు దాడులకు దిగారు. అంతేకాకుండా కార్యకర్తలు, కార్యకర్తల మధ్య కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో సభాప్రాంగణంలో ఒక దశలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో దాదాపు 12మంది కార్యకర్తలు గాయపడారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment