
సాక్షి, అనంతపురం: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం హిందూపురంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. కరువు పర్యటన పేరిట పవన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం చివరిరోజు పర్యటన సందర్భంగా హిందూపురంలోని జేవీఎస్ ప్యాలెస్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఈ సమావేశంలో తోపులాట జరిగింది. దీంతో గందరగోళం నెలకొని.. హాల్‌లోని గాజు అద్దాలు, కిటికీలు పగిలిపోయాయి.
ఈ తోపులాటలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయచంద్ర, నరసింహా మూర్తి, మంజునాథ్ తదితరులకి గాయాలయ్యాయి. వీరిలో జయచంద్ర పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. ఇలా సమావేశం అర్ధంతరంగా రసాభాసగా మారడంతో మధ్యలోనే ముగించి పవన్ వెళ్లిపోయారు. కాగా, తీవ్రంగా గాయపడిన జయచంద్రను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్టు సమాచారం.