జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ పంపిన ‘అనర్హత’ నోటీసులపై కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గమైన 18 మంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. సీఎల్పీ భేటీలకు హాజరుకావాలన్న పార్టీ విప్‌ను ధిక్కరించడంతో పాటు పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ సచిన్ సహా 19 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి స్పీకర్ సీపీ జోషిని కోరడంతో.. ఆయన ఆ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నోటీసులపై శుక్రవారం లోగా స్పందించాలని వారిని ఆదేశించారు. అయితే, ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్ సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మాత్రమే పార్టీ విప్‌లకు విలువ ఉంటుందని పైలట్ వర్గం అందులో పేర్కొంది. ఈ పిటిషన్ మొదట గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. పైలట్, సహ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే పిటిషన్‌లో పలు మార్పులు చేయాల్సి ఉందని, మరో పిటిషన్ దాఖలుకు సమయం కావాలని కోరారు.
దాంతో జడ్జి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. మార్పులు చేసిన పిటిషన్‌ను దాఖలు చేసిన తరువాత.. విచారణను ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్‌కు బదిలీ చేశారు. డివిజన్ బెంచ్ నేడు (శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు విచారించనుంది. అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు పైలట్ వర్గానికి స్పీకర్ ఇచ్చిన సమయం కూడా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటే కావడం గమనార్హం.
అనర్హులుగా ప్రకటిస్తే..
ఈ 19 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తే.. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. అప్పుడు మెజారిటీకి అవసరమైన సభ్యుల సంఖ్య 91కి తగ్గుతుంది. సీఎం గహ్లోత్‌కు ఇది మరింత ప్రయోజనకరమవుతుంది.
‘అనర్హత’పై మళ్లీ చర్చ
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే విషయంలో స్పీకర్‌కున్న అధికారాలు రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా పలు విభిన్న తీర్పులను ప్రకటించింది. ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని ఒక సందర్భంలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. మరో సందర్భంలో స్పీకర్ స్థానాన్ని తామే తీసుకుని ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించింది.
2011లో కర్ణాటకకు సంబంధించిన ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సచిన్ పైలట్ వర్గానికి అనుకూలంగా ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. నాడు, అప్పటి సీఎం యెడియూరప్పను వ్యతిరేకించిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన బెట్టింది. ఈ తీర్పును ప్రస్తావిస్తూ.. ‘పైలట్, ఆయన సహచర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం కానీ, చేరుతామని ప్రకటించడం కానీ చేయలేదు.
అందువల్ల అనర్హత నోటీసుల జారీ అన్యాయం. రాజ్యాంగవిరుద్ధం’ అని రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు, సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది పేర్కొన్నారు. సభాధ్యక్షుడిగా అనర్హత నోటీసులు జారీ చేసే హక్కు, అధికారం స్పీకర్‌కు ఉంటాయని మరో సీనియర్ న్యాయవాది అజిత్ సిన్హా వ్యాఖ్యానించారు. అయితే, స్పీకర్‌కున్న ఈ అధికారాల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు చాలా సందర్భాల్లో ఆచితూచి వ్యవహరించాయి.
Comments
Please login to add a commentAdd a comment