
సాక్షి, ప్రకాశం : గత ఏడేళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదర్కొని చరిత్ర సృష్టించామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా జగన్ ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు. కాంగ్రెస్‌ను ఎదిరించి బయటికొచ్చాక జరిగిన కడప ఉప ఎన్నికల్లో ఐదు లక్షల పై చిలుకు భారీ మెజార్టీతో గెలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులతో అన్యాయంగా జగన్‌కు జైలుకు పంపారన్నారు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి ధైర్యంగా ఉపఎన్నికలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని మెజార్టీతో వైఎస్‌ఆర్‌సీపీ గెలిపించారన్నారు. విశ్వసనీయత, విలువలు, నిబద్ధతకు వైఎస్ జగన్ కట్టుబడ్డారని, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల కోసం ముందుకెళ్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున 67 మంది గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కోట్లు పెట్టి కొనుగోలు చేశారని విమర్శించారు.
ఎన్నికలెప్పుడొచ్చినా 150 సీట్లు..
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి 30 కోట్లు ఇవ్వడమే కాకుండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా నలుగురిని మంత్రులను చేశారన్నారు. టీడీపీ దుర్మార్గ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్‌సీపీ కచ్చితంగా 150 కిపైగా సీట్లలో గెలుస్తుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణే నిదర్శనమని సజ్జల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment