
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ కూర్చుని సమీక్షా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ బుధవారం లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించే మందిరంలో ఆయన కూర్చునే కుర్చీలో బాలకృష్ణ కూర్చున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు ఐఏఎస్‌లు బాలకృష్ణకు ఎదురుగా కూర్చోవడం విశేషం.
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉండగా ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన బావమరిది.. ఆయన కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించడంపై అధికారులే విస్తుపోయారు. కానీ సీఎంకు బావమరిది కావడంతో ఏం మాట్లాడలేక మిన్నకుండిపోయారు. అదే సమయంలో మంత్రి హోదాలో ఉన్న దేవినేని బాలయ్య ఎదుట కూర్చుని ఆయనడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం గమనార్హం. దీనిపై మీడియాలో వార్తలు రావడం, ఏ హోదాలో సీఎం కుర్చీలో కూర్చుంటారని విమర్శలు రావడంతో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో బాలకృష్ణ సీఎం కుర్చీలో కాకుండా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించారు
Comments
Please login to add a commentAdd a comment