Lepakshi celebrations
-
బీజేపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయాం
అనంతపురం: బీజేపీతో పొత్తు పెట్టుకుని చాలా నష్టపోయామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన లేపాక్షి పట్టణంలో జరిగిన ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఆ రోజు ఇంకా 15 సీట్ల దాకా గెలుచుకునే వాళ్లమని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు మోసం చేశారని ఆరోపించారు. చివరి బడ్జెట్లోనూ మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లాభం లేదని నిర్ణయించుకునే కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నానని అన్నారు. నిలదీస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి భయంగా ఉందన్నారు. కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఇందుకు ప్రజల సహకారం కావాలని కోరారు. ఈ విషయంలో కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్రం సహకరిం చినా, సహకరించకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని వ్యాఖ్యానించారు. గట్టిగా అడిగితే కేంద్రం తనపై ఎదురుదాడి చేస్తోందని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా ఒక్క మాట మాట్లాడని జనసేన అధ్యక్షుడు ఈ రోజు యూటర్న్ తీసుకుని తనను విమర్శిస్తున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రమఖులు కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావు, రాళ్లపల్లి తదితరులను సన్మానించారు. ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఈ ఉత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో పాల్గొన్నారు. -
లేపాక్షిలో భారీ వర్షం..
సాక్షి, లేపాక్షి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హిందూపూర్ ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న లేపాక్షి ఉత్సవాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇంతలోనే లేపాక్షిలో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. ఆకాశం నిండా మేఘాలు కమ్ముకొని భీకరంగా మారిపోయింది. దీంతో భారీ ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. అయితే వర్షం తగ్గుముఖం పడితే ఆలస్యంగానైనా ఉత్సవాలను ప్రారంభించే అవకాశం ఉంది. -
హంద్రీనీవా.. వాస్తవం కనవా!
హంద్రీనీవా నీటితో ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. అసంపూర్తి పనులతో ప్రజలను మభ్యపెడుతోంది. ఇంతకాలం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి.. ఇప్పుడేమో లేపాక్షి ఉత్సవాల నాటికి నీరంటూ నమ్మబలుకుతోంది. వాస్తవ పరిస్థితి చూస్తే అడుగడుగునా అవాంతరాలే. పది రోజుల్లో అన్నింటినీ అధిగమిస్తే తప్ప లక్ష్యం నెరవేరని పరిస్థితి. ఇంత చేసినా.. చెరువులకు నీరివ్వడం కష్టమే. ♦ మొదటి, రెండోదశ పనులు పూర్తి చేసి 2015 నాటికే 7లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. ♦ 2014 సెప్టెంబర్‌లో అనంతపురంలో జల వనరుల శాఖమంత్రి ఉమామహేశ్వరావు ప్రకటన మూడు నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి చెరువునూ నీటితో నింపుతాం. ♦ 2015 ఫిబ్రవరిలో గవర్నర్ నరసింహన్ సాక్షిగా ముఖ్యమంత్రి హామీ ♦ 2016 డిసెంబర్లో గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద నీటిని విడుదల చేశారు. నేటికి 15 నెలలు కావస్తున్నా హిందూపురానికి చుక్క నీరు చేరలేదు. ఇక మడకశిర ప్రాంతానికి నీరు చేరడమూ అనుమానమే. హిందూపురం అర్బన్ : కరువు జిల్లాను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేసేందుకు 40 టీఎంసీల సామర్థ్యంతో 1988లో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 1994లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను సాగునీటి నుంచి తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చి ఐదు టీఎంసీల సామర్థ్యానికి కుదించారు. దీనిపై అప్పట్లో ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టడంతో పది టీఎంసీలకు మార్పు చేశారు. ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు హంద్రీనీవా పనులను మాత్రం పూర్తి చేయలేకపోయారు. 2004లో అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం.. హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయిలో జీవం పోసింది. 40 టీఎంసీల సామర్థ్యాన్ని పునరుద్ధరించడంతో పాటు రాయలసీమ మొత్తంగా 6.02లక్షల ఎకరాల ఆయకట్టును వైఎస్సార్ ప్రకటించారు. ఇందులో అనంత జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. జీడిపల్లి వరకు చేరిన కృష్ణా జలాలను పెనుకొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా మడకశిర సబ్ బ్రాంచ్ కెనాల్ నుంచి హిందూపురం, మడకశిర ప్రాంతాలకు సాగునీరు ఇచ్చేందుకు పనులు ప్రారంభించారు. దాదాపు 85 శాతం పనులను వైఎస్సార్ పూర్తి చేశారు. 2014 వరకు గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా 52 నుంచి 58వ ప్యాకేజీల్లో మడకశిర ప్రాంతం వరకు సుమారు 65 శాతం పనులు పూర్తయ్యాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 35 శాతం పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆయకట్టు కుదింపు మడకశిర బ్రాంచ్‌కెనాల్ ద్వారా పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, లేపాక్షి, హిందూపురం, పరిగి, మడకశిర, గుడిబండ, రొళ్ల, ఆగళి, అమరాపురం మండలాలకు నీరు అందించేలా ఈ ప్రాజెక్టులో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు పెనుకొండ మండలంలో 6,113 ఎకరాలు, రొద్దం మండలంలో 8,528 ఎకరాలు సోమందేపల్లి మండలంలో 18.344 ఎకరాలు, హిందూపురం 10.665 ఎకరాలు, లేపాక్షి మండలంలో 9,171 ఎకరాలు, పరిగి 6,971 ఎకరాలు, మడకశిర ప్రాంతంలో 18,108 ఎకరాల చొప్పున మొత్తం 77,900 ఎకరాలకు ఆయకట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రణాళికలు మార్చేసి 32.227 ఎకరాలకు కుదించారు. చెరువుల సంఖ్య తగ్గింపు మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా పెనుకొండలో ఐదు చెరువులు, రొద్దంలో రెండు, గోరంట్ల మండలంలో 136, చిలమత్తూరు మండలంలో 28 చెరువులకు నీరు ఇచ్చేలా ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పెనుకొండ, రొద్దం మండలాలకు మినహా మిగిలిన మండలాల చెరువులకు ఎగనామం పెట్టారు. పెనుకొండ మండలంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించినప్పటికీ అక్కడ కేవలం కోనాపురం, మావటూరు, రేగడ, అడదాకులపల్లి, నాగలూరు చెరువులను మాత్రమే జాబితాలో చూపుతున్నారు. అయితే గొల్లపల్లి రిజర్వాయర్ కింద 10వేల ఆయకట్టును ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఒప్పందం ఏమైంది ఎవరూ చెప్పడం లేదు. రొద్దం మండలంలో తొలుత 8,528 ఎకరాల ఆయకట్టు ప్రకటించారు. అయితే తురకలాపట్నం, సానిపల్లి చెరువుల ఆయకట్టును మాత్రమే చూపుతూ.. మిగిలిన ఆయకట్టును ఎగ్గొట్టారు. నీటిని మొత్తం కియా కంపెనీకి నీరిచ్చే యోచనతోనే సంఖ్య కుదించినట్లు తెలుస్తోంది. పనులన్నీ అసంపూర్తి.. చాకర్లపల్లి రైల్వే ట్రాక్ వద్ద బాక్స్పుషింగ్ పనుల వద్ద సిమెంట్ ఫ్లోరింగ్ పనులు పూర్తి కాలేదు. లిఫ్టింగ్ మోటర్ల ఏర్పాటు పూర్తి స్థాయిలో కాలేదు. ఆరు పంపింగ్ మోటర్లకు గాను కేవలం ఒకట్రెండుతో సరిపెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమందేపల్లి రోడ్డు బ్రిడ్జి వద్ద కాలవ మట్టిగోడల నిర్మాణాలు పూర్తి కాలేదు. న్యాయమైన పరిహారం ఇవ్వకపోవడంతో రాచేపల్లి వద్ద మూడు ఎకరాల్లో కాలువ తవ్వకం పనులను రైతులు అడ్డుకున్నారు. కాలువ తవ్వే ప్రాంతంలో అటువైపు ఉన్న పొలాలకు రైతులు వెళ్లేందుకు అనువుగా వంతెన నిర్మాణాలు పూర్తి చేయలేదు. దేమకేతపల్లి వద్ద రెండు ఎకరాల పరిహారం కోసం రైతు కోర్టును ఆశ్రయించడంతో అక్కడ పనులు ఆగిపోయాయి. కిరికెర నుంచి మడకశిర వరకు 56, 58 ప్యాకేజీల పనులు ఇంకా పూర్తికాలేదు. పెన్న, జయమంగళీ నదుల్లో పైపులైన్లు వేయాల్సి ఉంది. అప్పలకుంట వద్ద కొంత భూమి సేకరణ చేయాల్సి ఉంది. అవాంతరలన్నీ పది రోజుల్లో తొలగిపోతే తప్ప లేపాక్షికి హంద్రీ–నీవా నీరు చేరే పరిస్థితి లేదు. ఒకవేళ ఇవన్నీ పూర్తి చేసినా.. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి లేపాక్షి వరకు మధ్యలో ఉన్న దాదాపు 35 చెరువులకు నీరు చేరే పరిస్థితి లేదు. -
లేపాక్షి ఉత్సవాలు మళ్లీ వాయిదా
లేపాక్షి: లేపాక్షి ఉత్సవాలు మరోసారి వాయిదా పడ్డాయి. మార్చి 9, 10 తేదీల్లో నిర్వహించాల్సిన ఉత్సవాలను సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. గురువారం లేపాక్షికి విచ్చేసిన ఆయన..స్థానిక ఏపీ టూరిజం అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాల విజయవంతానికి అంద రూ కృషి చేయాలన్నారు. అలాగే జిల్లాలో చెరువులన్నింటినీ హంద్రీనీవా కాలువ ద్వారా నీరునింపి సాగు, తాగునీరు అం దించేందుకు ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు. అయితే ఇందుకు రైతులు కూడా సహకరించాలన్నారు. ఒకరిద్దరు రైతులు తమ పరిహారం కోసం కోర్టుకు వెళ్లడంతో పనులకు బ్రేక్ పడుతోందన్నారు. హంద్రీనీవా కాలువలు ద్వారా నీరు ఇచ్చిన తర్వాతే ఉత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ సూచించారన్నారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్ గోపాల్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రామ్మూర్తితో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అయితే తొలుత ఫిబ్రవరి 23, 24న లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత మార్చి 9,10 తేదీలకు వాయిదా వేశారు. అయితే తాజాగా కలెక్టర్ మరోసారి వాయిదా వేయడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. -
సీఎం కుర్చీలో బాలయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ కూర్చుని సమీక్షా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ బుధవారం లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించే మందిరంలో ఆయన కూర్చునే కుర్చీలో బాలకృష్ణ కూర్చున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు ఐఏఎస్‌లు బాలకృష్ణకు ఎదురుగా కూర్చోవడం విశేషం. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉండగా ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన బావమరిది.. ఆయన కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించడంపై అధికారులే విస్తుపోయారు. కానీ సీఎంకు బావమరిది కావడంతో ఏం మాట్లాడలేక మిన్నకుండిపోయారు. అదే సమయంలో మంత్రి హోదాలో ఉన్న దేవినేని బాలయ్య ఎదుట కూర్చుని ఆయనడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం గమనార్హం. దీనిపై మీడియాలో వార్తలు రావడం, ఏ హోదాలో సీఎం కుర్చీలో కూర్చుంటారని విమర్శలు రావడంతో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో బాలకృష్ణ సీఎం కుర్చీలో కాకుండా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించారు -
లేపాక్షి ఉత్సవాల్లో పోలీసుల ఆంక్షలు
హిందూపురం: లేపాక్షి ఉత్సవాల పేరుతో అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో పోలీసుల ఆంక్షలు సామాన్యులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏపీఆర్ఎస్ మైదానంలో లేపాక్షి ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం 5 గంటలకు హిందూపురం రావాల్సి ఉండగా, ఉదయం నుంచే పోలీసులు ఏపీఆర్ఎస్ మైదానానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే అన్ని రకాల వాహనాలను నిలిపి వేస్తున్నారు. నడిచి వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. చిన్న పిల్లలున్నా సరే వాహనాలను అనుమతించకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే, బాగేపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లేపాక్షి ఉత్సవాలకు ముందుగా శనివారం ఉదయం 10 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభం కాలేదు. -
రన్ బాలయ్య..ఉత్సవాల సందడయ్యా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి దృష్టి ఈ నెల 27, 28న లేపాక్షిలో నిర్వహించనున్న నంది ఉత్సవాలపైనే ఉందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం హిందూపురంలో చేపట్టిన 5కేరన్‌లో విద్యార్థులతో కలసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలను అందరూ అబ్బురపోయేలా నిర్వహిస్తామన్నారు. ఆలయ చరిత్ర, శిల్పకళ, చిత్రలేఖనం గురించి ప్రపంచానికి చాటిచెబుతామని పేర్కొన్నారు. ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించామని, రావడానికి ఆయన సుముఖం వ్యక్తం చేశారని చెప్పారు. శుక్రవారం లేపాక్షిలో హెరిటేజ్ వాక్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. - హిందూపురం -
పార్టీ మారినవారు రాజీనామా చేస్తారు
సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల విషయమై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రెండురకాలుగా స్పందించారు. వారు రాజీనామా చేస్తారని తొలుత పేర్కొన్న ఆయన ఆ తర్వాత మాటమార్చుతూ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. లేపాక్షి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కోసమే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. పార్టీ మారిన వారిని రాజీనామా చేసి తిరిగి గెలవాలన్న విపక్షం డిమాండ్‌ను విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ.. వారు రాజీ నామా చేస్తారని చెప్పారు. అయితే పక్కనున్న నేతలు చెవిలో గుసగుసలాడడం తో బాలకృష్ణ సర్దుకుని ఎందుకు రాజీనామా చేయాలని విలేకరుల్ని ప్రశ్నించారు. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలవలేదని చెప్పిన ఆయన అలాంటి వారిని నెత్తినెక్కించుకోనని పరోక్షంగా చెప్పారు. సినీ పరిశ్రమలో ఎవరిని పిలవాలో వారినే పిలిచానని, ఎవరిని పిలవాలో తనకు తెలుసన్నారు. తన పక్కన గ్లామర్ ఉన్నవాళ్లు ఉన్నారని, వారి తోనే ప్రయాణిస్తానన్నారు. ఎవరినీ నెత్తినెక్కిం చుకోనని, అలాంటి వాళ్లను పిలవనని చిరంజీవి గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను డిక్టేటర్ పద్ధతిలోనే వెళతానన్నారు. కాగా, లేపాక్షి నంది ఉత్సవాలను యునెస్కో సంస్థ పరిధిలోకి చేర్చడానికి కృషి చేస్తున్నామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపినట్టు బాలకృష్ణ తెలిపారు.