
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చొని ఆయన సమీక్ష నిర్వహించడం సర్వత్రా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో లేపాక్షి ఉత్సవాల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కుర్చీలో కూర్చొని మంత్రి దేవినేని ఉమ, ఐఏఎస్ అధికారులతో సమీక్ష చేశారు.
అయితే సమావేశానికి వచ్చిన ఐఏఎస్ అధికారులు... ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చోవడం చూసి విస్తుపోయారు. ముఖ్యమంత్రి పోస్ట్‌పై ఆసక్తి లేదని చెప్పే...ఆయన సాక్షాత్తూ.. సీఎం కుర్చీలో కూర్చొని సమీక్ష జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే...ఈ వ్యవహారంపై మంత్రి దేవినేని ఉమ నోరు మెదపడం లేదు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రొటోకాల్‌పై టీడీపీ రసవత్తరంగా చర్చ జరుగుతోంది.