
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ మంత్రిగా కొనసాగుతున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకే రోజే 33 రహస్య జీవోలు జారీ అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పాలసీ నిర్ణయాలకు అనుగుణంగా జారీ అయ్యే జీవోలను ఎప్పటికప్పుడు అన్‌లైన్ పోర్టల్ నమోదు చేస్తుంటారు.
అయితే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పంచాయతీరాజ్ శాఖ మొత్తం 36 జీవోలు జారీ చేయగా, అందులో కేవలం మూడు జీవోల వివరాలను మాత్రమే బహిర్గతం చేసి మిగిలిన జీవోల సమాచారం రహస్యమంటూ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వం రహస్య జీవోలు జారీ చేయడంపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.