
గ్యాంగ్‌టక్: ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటే ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలి. కానీ, సిక్కింలోని ఓ నియోజకవర్గంలో ఓటువేయాలంటే మాత్రం ప్రత్యేక వర్గానికి చెందిన సంఘాల ద్వారా గుర్తింపు పొందాలి. రాష్ట్రంలోని 32 నియోజకవర్గాలను ‘సంఘా’ అనే సన్యాసిల వర్గానికి కేటాయించారు. 2800 ఓటర్లున్న సంఘా నియోజకవర్గంలో.. ఎన్నికల్లో పోటీచేయాలన్నా, ఓటు హక్కు వినియోగించాలనుకున్నా దాదాపు 111 మఠాల్లో ఏదైనా ఒక మఠం ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. అందుకేనేమో భౌగోళిక చిత్రపటంలో సంఘా అసెంబ్లీ నియోజకవర్గం లేకుండాపోయింది. కనీసం దీని సరిహద్దులను కూడా ఇప్పటివరకు నిర్ణయించలేదు. ఎన్నికల సమయంలోనూ వీరికి ప్రత్యేకమైన ఈవీఎంలను కేటాయిస్తారు.
సిక్కింలో జరిగే త్రిముఖపోటీలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీపీ), పీ.ఎస్ గోలే ఆధ్వర్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎమ్), మాజీ ఫుట్‌బాల్ క్రిడాకారుడు బైచుంగ్ భూటీయ నెలకొల్పిన హమ్రో సిక్కిం పార్టీ(హెచ్‌ఎస్పీ), భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. ప్రస్తుత సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. ఈ ఎన్నికలలో విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారాన్ని చేపట్టి రికార్డు సృష్టించేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉండగా చామ్లింగ్ పోక్‌లోక్-కమరంగ్, నామ్చీ-సింగీథాంగ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయగా, భూటీయ గ్యాంగ్‌టక్, ట్యూమెన్ లింగి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ రాష్ట్రంలో 4,23,325 మంది ఓటర్లు ఉండగా..32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment