బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. బాబ్రీ మసీదు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, రామ మందిరం కోరుకున్న వాళ్లు బీజేపీకి ఓట్లేసి గెలిపించాలన్నారు. దీంతో ఎన్నికల ప్రచారం పూర్తిగా మత ప్రచారంలా మారిపోయిందంటూ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర కర్ణాటకలోని బెళగావి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత సంజయ్ పాటిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 'నా పేరు సంజయ్ పాటిల్. నేను హిందువును. మనది హిందూదేశం. బీజేపీని గెలిపిస్తే రామ మందిరం నిర్మిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాలికర్ రామ మందిరం నిర్మిస్తామని హామీ ఇస్తారు. కానీ వారిని గెలిపిస్తే కచ్చితంగా బాబ్రీ మసీదు నిర్మిస్తారు. మసీదు కోరుకునేవాళ్లు కాంగ్రెస్‌కు, రామ మందిరం కావాలనుకుంటే బీజేపీకి మద్దతు తెలపాలని' బహిరంగ సభలో సంజయ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలోనూ సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోటార్‌సైకిల్ ర్యాలీ సరిగ్గా చేయడం లేదని చెప్పిన పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించి విమర్శల పాలైన విషయం తెలిసిందే. రోడ్లు, నీళ్లు అంటూ అభివృద్ధి, పథకాల గురించి మాట్లాడకుండా బీజేపీ నేత సంజల్ పాటిల్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment