
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల దాడి చేసేందుకు బీజేపీకి మరో ఆయుధం దొరికింది. సిద్ధరామయ్య జోక్యంతోనే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ హెచ్‌ఎన్ సత్యనారాయణ రావు అనే మాజీ పోలీసు ఉన్నతాధికారి దర్యాప్తు కమిటీకి చెప్పారు. దీంతో ఇదే అంశాన్ని తమ ఆయుధంగా బీజేపీ ఉపయోగించుకొని ఎన్నికల ప్రచారంలో దాడి చేయాలని భావిస్తోంది.
శశికళకు ఖరీదైన పరుపు, దిండ్లు, ఇతర అన్నిరకాల సదుపాయాలు అందేలాగా జైలు అధికారులు ఏర్పాట్లు చేశారని, ఇది కూడా సిద్దరామయ్య జోక్యంతోనే సాధ్యమైందంటూ ఆ అధికారి చెప్పారు. జైలులో శశికళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ, ఆ మేరకు ముందే పోలీసు ఉన్నతాధికారులకు రూ.2కోట్లు అందాయంటూ డీ రూపా అనే పోలీసు అధికారి ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలో జైళ్ల శాఖకు హెడ్‌గా ఉన్న హెచ్‌ఎన్ సత్యనారాయణ రావు అనే పోలీసు అధికారిని విధుల్లో నుంచి తొలగించారు. ఈ సంఘటపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. దీంతో, దర్యాప్తు కమిటీకి కొన్ని వివరాలు చెప్పిన ఆయన సీఎం సిద్దరామయ్యకు సంబంధించి బాంబు పేల్చారు.