
కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న శిల్పా చక్రపాణిరెడ్డి
నంద్యాల అర్బన్: నంద్యాల టీడీపీ నాయకులు బ్రోకర్ల అవతారమెత్తి.. ఇళ్లు, స్థలాలు ఇప్పిస్తామంటూ పేదలను దోచుకుంటున్నారని నంద్యాల పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. వారి దోపిడీని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో మునిసిపల్ కౌన్సిలర్లు లేకుండానే ఏకపక్షంగా పట్టణంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నారని, దీనివల్ల పింఛన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పార్టీ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల గెలుపు టీడీపీ బలం కాదని, వాపు మాత్రమేనని అన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి, రూ.కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన గెలుపు గెలుపే కాదన్నారు.
నంద్యాలలో జరుగుతున్న పనుల్లో నాణ్యత కనపడటం లేదని, కాంట్రాక్టర్ల అవతారమెత్తిన టీడీపీ నాయకులను ఏమని సంబోధించాలో అర్థం కావడం లేదని అన్నారు. వారికి ఇష్టమైన చోట్ల రోడ్లు, పైప్‌లైన్‌లు వేసుకుంటూ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే నెల నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియలో స్థానిక కౌన్సిలర్ కూడా ఉండేలా చూడాలని, లేదంటే మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువ నాయకులు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, దేశం సుధాకర్, శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment