
సాక్షి బెంగళూరు : సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్న సీఎం కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య ఫోన్ సంభాషణ తర్వాత పరిస్థితులన్నీ సర్దుకున్నాయని అందరూ భావించారు. కానీ సరిగ్గా ఒక్కరోజు గడవకముందే మళ్లీ వివాదాలు తెరలేచాయి. అయితే ఈ సారి ఎవరైతే అనవసర వ్యాఖ్యలు చేయకుండా క్రమశిక్షణతో ఉండాలని ఫోన్‌లో సంభాషించుకున్నారో ఆ అధినేతలే ఈ సారి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
ఖర్గే అస్త్రాన్ని ప్రయోగించిన సీఎం..
సీఎం పదవిపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, జేడీఎస్ నేతల మాటల తూటాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను మళ్లీ సీఎం చేయాలని బహిరంగంగా డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో వారితో పాటు సిద్ధరామయ్యకు చెక్ చెప్పేందుకు బుధవారం ఎంపీ మల్లికార్జున ఖర్గే అస్త్రాన్ని సీఎం కుమారస్వామి ప్రయోగించారు. ఈ అస్త్రానికి తిరుగు అస్త్రాన్ని గురువారం ట్వీటర్‌తో ద్వారా సిద్ధరామయ్య ప్రయోగించారు. గురువారం తాజా, మాజీ సీఎంల మధ్య ట్వీటర్ వార్ జరిగింది.
రేవణ్ణ కూడా సీఎం అవ్వచ్చు..
జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి మల్లికార్జున ఖర్గేకు సీఎం కావాలని బుధవారం కుమారస్వామి వ్యాఖ్యానించారు. దీనికి ట్వీటర్ ద్వారా సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ‘మల్లిఖార్జున ఖర్గే సీఎం స్థానానికే కాదు. అంతకుమించి ఉన్నత స్థానానికి ఆయనకు అర్హత ఉంది. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీల్లో సీఎం స్థానానికి అర్హత కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అందులో హెచ్‌డీ రేవణ్ణ కూడా ఒకరు.
అందరికి సమయం రావాలి’ అని ట్వీటర్ ద్వారా వ్యంగ్యంగా కుమారస్వామిని లక్ష్యంగా చేసుకుని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. రేవణ్ణ పేరును ప్రస్తావించడం ద్వారా జేడీఎస్‌లో ముసలం పుట్టించే ప్రయత్నాలు చేశారు.
నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు..
దీనికి అంతేస్థాయిలో సీఎం కుమారస్వామి కూడా వెంటనే స్పందించి ఎదురుదాడి చేశారు. ‘‘ కొన్ని దశాబ్దాల కర్ణాటక రాజకీయ వాస్తవికతను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడు, విజ్ఞానవంతుడు అయిన మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి కావాలని నేను మాట్లాడాను. నా వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులిమి అపార్థం చేసుకుని, తప్పుగా విశ్లేషణలు చేయడం సరైన పద్ధతి కాదు.
ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తిని నేను కాదు. పార్టీ, ప్రాంతాలకు అతీతుడై మహోన్నత వ్యక్తి ఖర్గే అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు’’ అని ట్వీటర్‌లో సిద్ధరామయ్యకు కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి అధినేతల మధ్య ట్వీటర్ వార్ వల్ల సంకీర్ణప్రభుత్వంలో మరోసారి రాజకీయ సునామీకి కారణమయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment