
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : ఒకరు రాజకీయ నాయకుడు.. మరొకరు జానపద గాయకుడు.. ఇద్దరూ తమ రంగాల్లో లబ్ధప్రతిష్టులే.. భిన్న రంగాలకు చెందిన వీరిద్దరూ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఆ రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అయితే, మరొకరు జానపద గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్.
తూర్పు యూపీలోని అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తోంటే, ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ తరఫున దినేశ్‌లాల్ బరిలో దిగారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన దినేశ్‌లాల్ ‘నిరహువ’గా సుప్రసిద్ధుడు. ఘాజీపూర్‌లోని తాండ్వా గ్రామవాసి అయిన దినేశ్‌లాల్ ‘నిరహువ సతల్ రహే’ ఆల్బమ్‌తో అశేష భోజ్‌పురీల మనసు దోచుకున్నాడు. గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది.
ఇంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న దినేశ్ గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు అజంగఢ్ టికెట్ ఇచ్చేసింది బీజేపీ. నియోజకవర్గంలో ఓ వర్గం ఓటర్లను దినేశ్‌లాల్ ఆకట్టుకోగలరన్న నమ్మకంతోనే ఆయనకు టికెట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.