
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఢిల్లీలో సోమవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించేలా సీపీఎం ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్రంలో బీజేపీని గద్దెదించి లౌకిక ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసేలా పనిచేస్తామని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు విపక్ష పార్టీలకు సహకరిస్తామని చెప్పారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)తో కలసివచ్చే వారితో పనిచేస్తామన్నారు. కొన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులను ప్రకటించామని, త్వరలోనే మరికొన్ని స్థానాలకూ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.