
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎంత తిరిగినా ఇదే జరుగుతుందని, ప్రజలు ఆయనను నమ్మరని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరతారని చెప్పారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే బీజేపీకి ప్రాతినిథ్యం ఖాయమని, అసెంబ్లీలో బీజేపీకి మంచి స్థాయి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసినట్టు ఆయన వెల్లడించారు. ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే ఏయే అంశాలు చర్చకు వస్తాయో అవే తమ మధ్య చర్చకు వచ్చినట్టు తెలిపారు. తమ అధిష్టానంతో కూడా గంటా చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. తమ పార్టీలో ఎవరైనా చేరవచ్చని, ఇది నిరంతర ప్రకియ అని పేర్కొన్నారు.
‘అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా చాలా మంది నాయకులు మా పార్టీలో చేరుతున్నారు. రాష్ట్రంలో 2024 నాటికి బీజేపీయే ఏకైక ప్రత్యామ్నాయం. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఖాళీ అవుతుంది. చంద్రబాబు మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీడియా ఎంతో ప్రయత్నం చేస్తోందని, కానీ ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఆ 23 సీట్ల కోసం ఇక కష్టపడకండి. మీ ఎమ్మెల్యేలందరినీ మేం తీసుకుంటాం. సహకరించండి’ అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా చేరతారేమో చూద్దాం అంటూ హాస్యమాడారు.
కాగా, గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కమలం పార్టీలో చేరేందుకు తాను పావులు కదుపుతున్నట్టు వచ్చిన వార్తలను గంటా ఖండించకపోవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు రాకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీలో గంటా శ్రీనివాసరావు చేరడం ఖాయమని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సమక్షంలో చేరతారో నిర్ణయించుకోవాల్సింది ఆయనే అని వీర్రాజు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు, మాజీ మంత్రులు బీజేపీలోకి వెళ్లడంతో గంటా చేరిక కూడా లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment