సాక్షి, గుంటూరు: ఆ సీనియర్ నాయకుడిని చేసిన పాపాలే వెంటాడుతున్నాయి. అన్ని విధాలుగా ఉచ్చు బిగుస్తున్నాయి. ఆయన వల్ల పార్టీ పరువే కాదు.. కుటుంబపరువూ పోయింది. ఇలాంటి నాయకుడిని పార్టీ నుంచి గెంటేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన చేసిన పాపాలు ఏంటి?
గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెల శివప్రసాదరావుది ఒక చరిత్ర. రాజకీయాల్లోకి రాకముందు ఒక మంచి డాక్టరుగా పేరు పొందారు. కానీ ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో కావాల్సినంత చెడ్డపేరు తెచ్చుకున్నారు. తీవ్రమైన అత్యాశ, పదవీకాంక్ష కోడెలను రాజకీయంగా భ్రష్టు పట్టించాయి. కోడెల ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికయ్యాక 1983 నుంచి 85 వరకూ బాగానే సాగింది. ఆ తర్వాతే రాజకీయంగా ఎదగటం కోసం అనేక అడ్డదారులు తొక్కారు. విపరీతమైన పదవీ కాంక్ష కోడెలను పక్కదారి పట్టేలా చేసిందన్నది ఆయన అనుచరులే మాట.
ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లల్లోనే తుపాను బాధితులకు సాయంగా అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఏకంగా తన ఇంట్లో దాచుకున్న ఆ బియ్యాన్ని అప్పట్లో కమ్యూనిస్టులు వెలుగులోకి తెచ్చారు. తుఫాను బియ్యం దోచుకున్న దొంగ అని అప్పట్లో చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇతరుల ఆస్తులు బలవంతంగా లాగేసుకోవటం దగ్గర్నుంచి విలువైన స్థలాలు కబ్జాలు చేయటం, కమీషన్లు దండుకోవటం ఇలా ఎన్నో చేశారు. 1999 ఎన్నికల సమయంలో ఏకంగా ఆయన సొంత ఇంట్లోనే బాంబులు పేలి నలుగురు ముఖ్య అనుచరులు చనిపోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కోడెల సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్న సమయంలోనే విజయవాడలో వంగవీటి రంగా హత్య జరగటం, అందులో కోడెల పాత్ర ఉందన్న అరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించటంతోపాటు ఎన్టీయార్ కుటుంబానికి కూడా కోడెల చాలా దగ్గర. ఈ కారణంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనను ఏమీ చేయలేకపోయారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కొంతకాలం వరకూ కోడెలే ఛైర్మన్ గా ఉన్నారు. ఆదే సమయంలో అక్కడ అక్రమాలు జరగడంతో ఆయన ఆ పదవిని వదలాల్సి వచ్చింది. ఇక గుంటూరు రాజకీయాల్లో శివప్రసాదరావు ఏం చెప్తే అదే జరిగేది. అలాంటి రాజకీయాలు చేయటం వల్ల అధినేత చంద్రబాబు కూడా ఆయనను పల్లెత్తి మాట అనలేదు.
కొంతకాలంగా కోడెలకు, చంద్రబాబుకు పొసగటంలేదన్న వార్తలున్నాయి. అయినా తనకున్న పలుకుబడితో 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి సీటు సంపాదించి గెలిచారు. ఒక పత్రికాధిపతి రికమెండేషన్‌తో అసెంబ్లీకి స్పీకర్‌గా కూడా పనిచేశారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ కోడెల వైఖరిలో మార్పు రాలేదు. పైగా ఆయనే కాకుండా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కూడా రంగంలోకి దిగారు. వారు సత్తెనపల్లి, నరసరావుపేటలో చక్రం తిప్పారు. ఎమ్మార్వో ఆఫీసులో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే కోడెల మనుషులకు ఐదు వందల రూపాయలు లంచం ఇవ్వాలి. ఆ తరువాతే సర్టిఫికెట్ తెచ్చు్ఓవడానికి వీలయ్యేది. ఈ లంచావతారాలను తట్టుకోలేక బిల్డర్లు పనులు ఆపేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. కే టాక్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు ప్రజల ముక్కుపిండి వసూలు చేశారు. చివరికి ప్రభుత్వ ఆస్తిని సైతం చోరీ చేసే స్థాయికి దిగజారారు.
అసెంబ్లీలో ఉండాల్సిన కోట్ల విలువైన ఫర్నీచర్‌ను నేరుగా తన ఇంటిలో దాచిపెట్టుకున్నారు కోడెల శివప్రసాద్. తాజాగా చోరీ వ్యవహారం బయట పడటంతో అధినేత చంద్రబాబుకు మంచి అవకాశం దొరికింది. దాంతో కోడెలను పార్టీ నుంచి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంపై పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. కోడెల చేసింది తప్పేనన్నారు. చంద్రబాబు కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. కోడెల తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవచ్చంటూ సూచించారు. అంటే కోడెలను బయటకు పంపించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. త్వరలోనే కోడెల వ్యవహారంపై ఒక కమిటీ ద్వారా విచారణ జరిపించి, వెంటనే షోకాజు నోటీసులు ఇవ్వటం, దానిపై కోడెల స్పందించిన తీరు నచ్చలేదన్న కారణంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. మొత్తమ్మీద కోడెలకు పచ్చ పార్టీలో నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఈ సంకట స్థితి నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment