తొలి నుంచి బీజేపీలో సింధియాలున్నారు. ఇటు సింధియాల్లోనూ బీజేపీ రక్తముందన్నది సత్యం. అంతేకాదు ఇటు దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌లోనూ, భారత రాజకీయాల్లో ప్రత్యర్థుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తోన్న బీజేపీలోనూ సింధియా కుటుంబం జాడలున్నాయి. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం నానమ్మ కలనిజం చేసేందుకేనా అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.
ఎవరీ విజయ రాజే?
గ్వాలియర్ రాజమాతగా ప్రసిద్ధి చెందిన విజయరాజే సింధియా, మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి 1957లో గెలుపొందడంతో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత 1962, 1989, 1991, 1996, 1998లో విజయరాజే తన విజయపరంపర కొనసాగించారు. 1967 నుంచి 1971 వరకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన విజయరాజే ఏనాడూ ఓటమిని ఎరుగరు. 1967 వరకు ఆమె కాంగ్రెస్‌లో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్‌కి రాజీనామా చేసి, జనసంఘ్‌లో చేరారు. ఎమర్జెన్సీ కాలంలో కొన్ని రోజులు జైలుజీవితం గడిపారు. 1980లో బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బీజేపీ పాదుకొల్పుకోవడానికి విజయ కృషి చేశారు. 1971లో ఇందిరాగాంధీ సుడిగాలిని తట్టుకొని బింద్ నుంచి విజయరాజే, గ్వాలియర్ నుంచి వాజ్‌పేయి, విజయరాజే కొడుకు మాధవరావు సింధియా గుణ స్థానం నుంచి గెలిచారు. మాధవరావు 26 ఏళ్ళకేæఎంపీ అయ్యారు. మాధవరావు సింధియాకి కాషాయ జెండాపై ఉన్న కాంక్ష ఎంతో కాలం నిలవలేదు. ఎమర్జెన్సీ అనంతరం 1980లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని గుణ స్థానం నుంచి ముచ్చట గా మూడోసారి గెలుపుగుర్రం ఎక్కారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం జ్యోతిరాదిత్య తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు.
బీజేపీలో విజయరాజే వారసులు
అదే సమయంలో విజయరాజే కుమార్తెలు వసుంధర రాజే, యశోధర రాజేలు రాజకీయరంగ ప్రవేశం చేశారు. వసుంధర రాజే 1984లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ధోల్‌పుర నుంచి ఎన్నికయ్యారు. వసుంధర కుమారుడు దుశ్యంత్ రాజస్తాన్‌లోని ఝల్వార్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు.
యశోధరాగమనం
యశోధర మాత్రం 1977లో డాక్టర్ సిద్ధార్థ బన్సాలీని పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళిపోయారు. ఆమె ముగ్గురు పిల్లల్లో ఒక్కరు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1994లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన యశోధర 1998 ఎన్నికల్లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేశారు. శివరాజ్ సింఘ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
కాంగ్రెస్‌లోనే కొనసాగిన జ్యోతిరాదిత్య
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా 2001లో విమాన ప్రమాదంలో మరణించడంతో గుణ లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసిన జ్యోతిరాదిత్య 4.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆ తరువాత వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర వహించిన జ్యోతిరాదిత్యకి సీఎం పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అనుభవజ్ఞుడైన కారణంగా కమల్‌నాథ్‌కి దక్కింది. ఎంపీగా 2019లో ఓటమి చవిచూడడంతో పార్టీ జ్యోతిరాదిత్యని పక్కన పెట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment