నేడు అధికారులకు విప్‌ల నియామక లేఖలు | state election commission has completed arrangements for conducting elections | Sakshi
Sakshi News home page

నేడు అధికారులకు విప్‌ల నియామక లేఖలు

Published Thu, Jun 6 2019 3:46 AM | Last Updated on Thu, Jun 6 2019 3:46 AM

state election commission has completed arrangements for conducting elections - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: శుక్రవారం మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. 7న తొలుత కో ఆప్షన్‌ సభ్యుల నామినేషన్ల స్వీకారం, కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత ఎంపీపీ పదవులకు ఎన్నికలుంటాయి. ఒక్కో ఎంపీపీ పరిధిలో ఒక్కో కోఆప్టెడ్‌ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక పూర్తికాకపోతే ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు అవకాశం లేదు. ఎంపీపీ పదవులకు ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో ఆయా పదవులకు సంబంధించి రిజర్వేషన్లను పొందుపరిచింది. ఎన్నికలు జరగనున్న మొత్తం 538 ఎంపీపీల్లో మహిళలకు 269 స్థానాలు దక్కుతాయి.  

నేడు విప్‌ల అందజేత...
శుక్రవారం నిర్వహించే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు (గురువారం) ఉదయం 11 గంటలలోపు రాజకీయ పార్టీలు విప్‌ల నియామకానికి సంబంధించిన లేఖను, ఫామ్‌–ఎను ప్రిసైడింగ్‌ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ లేఖతోపాటు విప్‌ జారీచేసే వ్యక్తి గుర్తింపు కార్డుతోపాటు ఆధారిత లేఖ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పత్రాన్ని గురువారం అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి నుంచి విప్‌ అధికారం పొందిన వ్యక్తి ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో చేయి ఎత్తే పద్ధతిలో ఎవరికి ఓటేయాలన్న దానిపై సభ్యులకు విప్‌ జారీచేస్తారు.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్, జనతా దళ్, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీలకు విప్‌ జారీచేసే అవకాశముంది. అయితే గెలుచుకునే ఎంపీపీ స్థానాలను బట్టి ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మరో ఒకటి, రెండు పార్టీలు విప్‌ను జారీచేయవచ్చునని తెలుస్తోంది. షెడ్యూల్‌ ఏరియాలోని వరంగల్, ఖమ్మం జెడ్పీల పరిధిలోని బయ్యారం, గార్ల, గంగారం మండలాలను షెడ్యూల్‌ మండలాలుగా గుర్తించారు. గతంలో షెడ్యూల్‌ మం డలాలు 24 ఉండగా, సవరించిన జాబితా ప్రకారం 33కు చేరుకున్నాయి. దీంతో ఎస్సీ, బీసీలకు స్థానాలు తగ్గాయి. రిజర్వేషన్ల కోటాను ఖరారు చేస్తూ ఇదే పద్ధతిలో కోటా కేటాయించాలని ఆదేశాలిచ్చారు.  

మహిళల హవా...
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మహిళల జనాభా అధికంగా ఉండడంతో ఆ జిల్లాల్లో వారికి ఎక్కువ ఎంపీపీ స్థానాలు కేటాయించారు. జిల్లాల వారీగా నిజామాబాద్‌లో 51.75 శాతం, నిర్మల్‌లో 51.47, జగిత్యా లలో 51.10, కామారెడ్డిలో 50.77, మెదక్‌లో 50.67, ములుగులో 50.38, రాజన్న సిరిసిల్లలో 50.36, జయశంకర్‌ భూపాలపల్లిలో 50.28, సిద్దిపేటలో 50.22, భద్రాద్రి కొత్తగూడెంలో 50.09, వరంగల్‌ అర్బన్‌లో 50.09, కరీంనగర్‌లో 50.08, వికారాబాద్‌తో 50.01 శాతంగా మహిళలున్నట్లు ఎస్‌ఈసీ రికార్డులను బట్టి తెలుస్తోంది. అదే విధంగా 17 జిల్లాల్లో సగటున 49.96 శాతం నుంచి 49.22 శాతంలో, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో 48.88 శాతం మహిళలు ఉన్నట్టు రిజర్వేషన్ల జాబితాలో ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement