సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విశ్వసనీయత కనిపించడం లేదని.. ఇంత తప్పుల తడకలతో కూడిన బడ్జెట్‌ను ఎన్నడూ చూడలేదని అధికార వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. బడ్జెట్ గణాంకాలు కూడా వారి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలని అందరం కోరుకుంటామని.. కానీ కేంద్రం నుంచి రాని నిధులు కూడా వస్తాయంటూ బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించడం ప్రజల్ని మోసం చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ కింద కేవలం రూ.138 కోట్లు మాత్రమే వస్తాయని కేంద్రం ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బడ్జెట్ పెట్టడానికి ముందు కూడా ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారని.. అయినా కూడా రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం నుంచి రూ.12,099 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. మన రాష్ట్రానికి ఏఏ నిధులు వస్తాయో అందులో స్పష్టం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రెవెన్యూ లోటు భర్తీ కింద కేటాయింపులు చేయకుండా.. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేసుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు వస్తాయని ప్రతిపాదించడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు.
అలాగే వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్ర బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో మాత్రం కేంద్రం నుంచి రూ.350 కోట్లు వస్తాయని ప్రతిపాదించడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రాని నిధులను కూడా వస్తాయంటూ భారీగా ప్రతిపాదించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.9000 కోట్లు వస్తాయని పేర్కొనడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. ఇలాంటి అంకెల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి ప్రయోజనం ఉండదని.. కేవలం ప్రచారం చేసుకోవడానికే పనికివస్తుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ లెక్కలెలా నమ్మాలి బాబూ!
Published Sat, Mar 10 2018 3:30 AM | Last Updated on Sat, Mar 10 2018 12:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment