పార్టీ జెండాతో దినకరన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన ఇటీవల స్థాపించిన కొత్త పార్టీ గుర్తు, పార్టీ పేరు ఉపయోగించొద్దని దినకరన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దినకరన్ పార్టీ గుర్తు, పేరుపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోవైపు తాను స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనని స్వయంగా దినకరన్ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని ఇటీవల స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. పైన నలుపు, మధ్యలో తెలుపు, కింది భాగంలో ఎరుపు, మధ్యలో దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దినకరన్ ప్రకటించారు.
ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బహిష్కృతులైన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment