
ఉద్యమకారులను కాపాడే అవకాశం తనకు ఇవ్వాలని.. కార్యకర్తల ఇష్టానుసారం నడుచుకుంటానని అన్నారు.
సాక్షి, వరంగల్: టీఆర్‌ఎస్ తరఫున టికెట్ లభించని నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది. తాజాగా పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు పర్యాయాలుగా పాలకుర్తి ప్రజలు టీఆర్‌ఎస్ పక్షాన నిలిచిన అన్యాయమే జరిగిందని అన్నారు. ఉద్యమకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందడం లేదని విమర్శించారు. పాలకుర్తి అసెంబ్లీ స్థానంపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పునరాలోచించి.. అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాలకుర్తి ఉద్యమకారులు గడ్డ అని.. భయపడే ప్రసక్తే లేదని తెలిపారు.
ఉద్యమకారులను కాపాడే అవకాశం తనకు ఇవ్వాలని.. కార్యకర్తల ఇష్టానుసారం నడుచుకుంటానని అన్నారు. టీడీపీ నుంచి గెలిచిన దయాకర్ రావు టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత పాలకుర్తిలో అభివృద్ది శూన్యం అని.. ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తనకు ఇస్తానని చెప్పిన వరంగల్ ఎమ్మెల్సీ పదవి కొండ మురళికి ఇచ్చినా తాను బాధపడలేదని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయసేకరణతోనే తనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 2004, 2009, 2014లలో పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌పై ఆశ పడినప్పటికీ.. కేసీఆర్ ఆదేశాల మేరకు తప్పుకున్నానని తెలిపారు.