రెండు కూటములు.. నాలుగు పార్టీలు.. రొంబ పోటీ | Tamil Nadu Lok Sabha Elections Special Story | Sakshi
Sakshi News home page

రెండు కూటములు.. నాలుగు పార్టీలు.. రొంబ పోటీ

Published Tue, Apr 9 2019 9:20 AM | Last Updated on Tue, Apr 9 2019 9:20 AM

Tamil Nadu Lok Sabha Elections Special Story - Sakshi

తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన అగ్రనేతలు ఎం.కరుణానిధి (డీఎంకే), జయలలిత (ఏఐఏడీఎంకే) మరణించాక జరుగుతున్న ఎన్నికలివి. రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లకు ఈ నెల 18న జరుగుతున్న ఎన్నికలు తమిళ రాజకీయాలను కొత్త మలుపు తిప్పబోతున్నాయి. పెద్ద హడావుడి లేకుండా లోక్‌సభతో (39 సీట్లు) పాటు 18 అసెంబ్లీ సీట్లకు జరిగే ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. చాలా కాలంగా రాజకీయాలు, సినిమా కలగలిసిపోయిన తమిళనాట 2019 పార్లమెంటు ఎన్నికల్లో పైకి రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు ఏఐఏడీఎంకే, డీఎంకే నాయకత్వాన రెండు కూటముల మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి చతుర్ముఖ పోటీలు జరుగుతున్నాయి. జయలలిత సహచరి వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే), సినీ నటుడు కమల్‌హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీతి మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) కూడా అభ్యర్థులను నిలపడంతో ఓట్లు నాలుగు వైపులా చీలిపోతాయి. ఏఐఏడీఎంకే, డీఎంకే రెండు జాతీయ పార్టీలతోనూ, ఇతర చిన్నా చితకా పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగగా, దినకరన్, కమల్‌హాసన్‌ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. జల్లికట్టు పోటీలను మించిన ఉత్కంఠ కలిగిస్తున్న ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇదీ..

బలహీనమైన ద్రవిడ పార్టీలు?
జయలలిత మరణించాక పై చేయి సాధించిన శశికళ వర్గాన్ని తట్టుకుని నిలబడడానికి ఏఐఏడీఎంకేలో సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) చేతులు కలపి పార్టీని నిలబెట్టారు. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు. నరేంద్ర మోదీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అన్నాడీఎంకే ప్రభుత్వం నడుస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో గెలిచిన దినకరన్‌ ఈసారి రెండు ప్రధాన ద్రవిడ పార్టీల ఓట్లను చీల్చి అసెంబ్లీ ఎన్నికల ముందు తన బలం నిరూపించుకోవాలని చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లోని పాలక పక్షాలైన బీజేపీ, ఏఐఏడీఎంకే కలిసి పోటీ చేయడం వల్ల సానుకూల ఫలితాలు రాకపోవచ్చని రాష్ట్ర రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రెండు సర్కార్లపై జనంలో వ్యతిరేకత ఓ స్థాయి దాటితే డీఎంకే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా. కరుణానిధి మరణించాక ఆయన రెండో కొడుకు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి డీఎంకేలో పదవి కోసం పార్టీ అధ్యక్షుడు, తమ్ముడు స్టాలిన్‌పై ఒత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారి చెల్లెలు, రాజ్యసభ ఎంపీ కనిమొళి దక్షిణ ప్రాంతంలోని తూత్తుకుడి నుంచి లోక్‌సభకు డీఎంకే తరఫున పోటీ చేస్తున్నారు. అళగిరికి ఈసారి మదురై నుంచి డీఎంకే టికెట్‌పై పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. కాని, డీఎంకేలో విభేదాలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. డీఎంకేపై స్టాలిన్‌ పూర్తి పట్టు సాధించారు.

పాలకపక్షానికి ఎదురీతే!
రేవు పట్టణమైన తూత్తుకుడిలో భూగర్భజలాలు కలుషితం కావడానికి దారితీసిన స్టెర్‌లైట్‌ కాపర్‌ స్మెల్టింగ్‌ కర్మాగారం మళ్లీ ప్రారంభం కావడంతో ఇక్కడ జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్య ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమికి ఇబ్బందికరంగా మారింది. కిందటేడాది స్టెర్‌లైట్‌ ఫ్యాక్టరీ వద్ద జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. అలాగే పాలక పక్షానికి కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులోని శివకాశిలో వెయ్యి బాణసంచా తయారీ యూనిట్ల మూసివేతకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. కన్యాకుమారి జిల్లాలో 2017లో వచ్చిన ఓకీ తుఫాన్‌ సృష్టించిన విధ్వంసంలో 191 మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం కూడా ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సేలం– చెన్నై గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దసంఖ్యలో నిరసన తెలిపారు. కిందటి ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు నూరు శాతం విజయాలు అందించిన ఈ ప్రాంతంలో పాలకపక్షం ఎదురీదే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

పశ్చిమ ప్రాంతంలో హోరాహోరీ
తొమ్మిది లోక్‌సభ సీట్లున్న పశ్చిమ ప్రాంతం గతంలో ఏఐఏడీఎంకేకు పెట్టని కోట. కొంగునాడుగా పిలిచే ఈ ప్రాంతంలో మారిన పరిస్థితుల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమి సగం స్థానాలు కైవసం చేసుకున్నా మంచి ఫలితాలు సాధించినట్టు భావించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కమల్‌హాసన్‌ నాయకత్వంలోని ఎంఎన్‌ఎం, దినకరన్‌ పార్టీ ఏఎంఎంకే కూడా రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాల ఓట్లను చెప్పుకోదగ్గ సంఖ్యలో చీల్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఎంఎంకే కావేరీ డెల్టా ప్రాంతంలో డీఎంకేకు పడే సంప్రదాయ ఓట్లతోపాటు దక్షిణ తమిళనాడులో కూడా ఇతర ప్రధాన పార్టీల ఓట్లను గణనీయంగా చీల్చుకుంటే తమిళనాట 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. రాజధాని చెన్నైలోని మూడు లోక్‌సభ సీట్లలో డీఎంకే బలం ఎక్కువ. ఇది తన భాగస్వామి కాంగ్రెస్‌కు 9 సీట్లిచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ సాధించింది ఐదు శాతం సీట్లే కావడంతో దాని బలానికి మించి ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోందని భావించాలి. వరుసగా 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కాంగ్రెస్‌ ఒత్తిడికి లొంగిపోయారు. 

తేవర్లు, గౌండర్ల ఓట్లు ఎవరికి?
సీఎం ఈపీఎస్‌ (గౌండర్‌), డిప్యూటీ సీఎం ఓపీఎస్‌ (తేవర్‌) సామాజికవర్గాల (రెండూ బీసీ కులాలే) మద్దతుపై ఏఐఏడీఎంకే ఈ ఎన్నికల్లోనూ ఆధారపడుతోంది. పశ్చిమ ప్రాంతంలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో గౌండర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. మధ్య, దక్షిణ ప్రాంతాల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో తేవర్ల ప్రభావం ఎక్కువ. ఈ 14 సీట్లలో తమ అభ్యర్థుల విజయానికి ఈ రెండు కులాలపై అన్నాడీఎంకే ఆధారపడుతోంది. దినకరన్‌ పార్టీ కారణంగా తేవర్ల మద్దతు గతంలో మాదిరిగా పాలక పక్షానికి లభించకపోవచ్చని భావిస్తున్నారు. ఉత్తర జిల్లాల్లోని పది లోక్‌సభ స్థానాల్లో మరో బీసీ వర్గమైన వన్నియార్లు డాక్టర్‌ రాందాస్‌ నాయకత్వంలోని పీఎంకేకు గట్టి మద్దతుదారులు. వన్నియార్ల మద్దతు పీఎంకేకు లభిస్తే ఏఐఏడీఎంకే కూటమికి ఇక్కడ విజయావకాశాలు పెరుగుతాయి. విల్లుపురం, తెంకాసి, చిదంబరం, తిరువళ్లూర్‌ స్థానాల్లో దళితుల మద్దతు కూడగట్టే పార్టీలకు గెలుపు సులువవుతుంది. దక్షిణ జిల్లాల్లో బీసీ వర్గమైన నాడార్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. వారి మద్దతు తోనే 2014లో కన్యాకుమారి సీటును బీజేపీ గెలుచుకుంది.

మారిన ద్రవిడ పార్టీల ‘స్టాండ్‌’
హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలనడాన్ని తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే వ్యతిరేకించడమే గాక రాజ్యాంగ సవరణ ద్వారా ఇంగ్లిష్‌ను అధికార భాషగా చేయాలని 1962 ఎన్నికల మేని ఫెస్టోలో డిమాండ్‌ చేసింది. కాని, 57 ఏళ్ల తర్వాత కొత్త డిమాండ్‌తో ఈ పార్టీ ముందుకొచ్చింది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లోనూ తమిళాన్ని ఒక అధికార భాషగా చేయాలని తన ప్రత్యర్థి ఏఐఏడీఎంకేతో పాటు డీఎంకే నేడు డిమాండ్‌ చేస్తోంది. 1967 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు ద్రవిడ పార్టీల విధానాల్లో వచ్చిన మార్పులకు ఇది అద్దం పడుతోంది. తమిళుల ఆత్మగౌరవం, కుల వ్యతిరేక సిద్ధాంతం తో పెరియార్‌ ఈవీ రామస్వామి నాయకర్‌ 1925లో ద్రవిడ కజగం (డీకే)ను ఉద్యమ పార్టీగా ప్రారంభించారు. కుల నిర్మూలన లక్ష్యం, బ్రాహ్మణ వ్యతిరేకతగా, మూఢ విశ్వాసాలపై పోరాటం నాస్తికవాదంగా ఈ పార్టీని ముందుకు నడిపించాయి. ఎన్నికల్లో పోటీ చేయకూడదనే డీకే ప్రధాన సిద్ధాంతంతో సీఎన్‌ అన్నాదురై విభేదించి 1949లోనే ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. నాస్తికత్వం స్థానంలో లౌకికవాదాన్ని డీఎంకే తీసుకొచ్చింది. ప్రత్యేక దేశంగా ద్రవిడస్తాన్‌ కావాలన్న డిమాండ్‌ను కూడా డీఎంకే వదులుకుంది. 1962 చైనా యుద్ధం నాటికి మద్రాసు (తమిళనాడు పాతపేరు) అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే నేత అన్నాదురై తమ ‘వేర్పాటువాద’ డిమాండ్‌కు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించారు. 1965లో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేసింది.

బ్రాహ్మణ వ్యతిరేకత కనుమరుగు..
బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రతిఘటిస్తూ డీకే ప్రచారం చేసిన బ్రాహ్మణ వ్యతిరేకత నేడు రెండు ద్రవిడ పక్షాల్లో కనుమరుగైంది. 1967 నుంచీ ఈ రెండు పక్షాలే అధికారంలో ఉన్న క్రమంలో బ్రాహ్మణేతర కులాల వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో తగినంత ప్రాతినిధ్యం రిజర్వేషన్ల ద్వారా లభించింది. ఈ విషయంలో డీఎంకేకు బ్రాహ్మణేతర పార్టీగా ఇంకా పేరున్నా అన్నాడీఎంకేకు అలాంటి ఇమేజ్‌ లేదు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జయలలిత ముఖ్యమంత్రి కావడమే దీనికి ప్రబల తార్కాణం. 1980ల్లో తమిళనాడులో ఆశ్రయం పొందిన శ్రీలంక తమిళులకు మద్దతుగా వచ్చిన ఉద్యమాల ఫలితంగా మరోసారి ‘తమిళ జాతీయవాదం’ ముందుకొచ్చింది. ఇప్పటికీ తమిళనాడు ప్రయోజనాలు కాపాడడానికి చేసే ప్రయత్నాలను తమిళ జాతీయవాదం, తమిళ భాషా జాతీయవాదంగానే పిలుస్తున్నారు.

ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు
తీవ్రమవుతున్న నీటి కొరత, వ్యవసాయరంగ సంక్షోభం, కులాల సమస్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు ప్రభావం, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి అమలు చేస్తున్న జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) లోక్‌సభ ఎన్నికల్లో విజేతలను నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై వ్యతిరేకత ఉందని అనేక సర్వేలు సూచిస్తున్నాయి.
ప్రధాని తమిళనాడు వచ్చినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు బలమైన రాజకీయ కూటముల మధ్య జరిగే ఎన్నికల పోటీలో ఫలితాలను అంచనా వేయడం కష్టమేగాని పాలకపక్షాలపై వ్యతిరేకత మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

జనాభా8కోట్లు
మొత్తం ఓటర్లు 5.89కోట్లు
అక్షరాస్యత    87%
2014 ఎన్నికల్లో పోలింగ్‌      73.67%
గత ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు (39)
ఏఐఏడీఎంకే  37
బీజేపీ         01
పీఎంకే        01

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement