తమ్ముళ్లను ఛీ కొట్టిన జనం..  | TDP Disappears In Kadapa District | Sakshi
Sakshi News home page

కడపలో సై‘కిల్‌’ 

Published Mon, Nov 25 2019 12:02 PM | Last Updated on Mon, Nov 25 2019 2:29 PM

TDP Disappears In Kadapa District - Sakshi

జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.గత ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ, కడప, రాజంపేట పార్లమెంటు స్థానాల్లో ఘోర పరాజయం పాలైంది.కొన్ని నియోజకవర్గాల్లో నాలుగైదు సార్లు పోటీలో నిలిచినా ఓటమి తప్పలేదు. మరికొన్నిచోట్ల హ్యాట్రిక్‌  ఓటములను దక్కించుకున్న టీడీపీ  జిల్లాలో  కోలుకోలేని  పరిస్థితికి చేరింది. 

సాక్షి, ప్రతినిధి కడప: గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం, రాయచోటి, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, మైదుకూరు, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ తిరుగులేని విజయం సాధించింది. ఒక్క స్థానం నుంచి కూడా టీడీపీ గెలుపొందలేదు. కడప పార్లమెంటు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఘన విజయం సాధించగా, టీడీపీ  అభ్యర్థిగా బరిలో దిగిన సి.ఆదినారాయణరెడ్డి ఘోర ఓటమి చవిచూశారు.  రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఘన విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభ పరాజయం పాలయ్యారు.

ఈ పరిస్థితుల్లో జిల్లాలో టీడీపీకి భవిష్యత్తు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.  గత ఎన్నికల ఫలితాలను  పరిశీలిస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి ఇద్దరు ఒక్కటైనా టీడీపీని గట్టెక్కించలేకపోయారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున రామసుబ్బారెడ్డి పోటీలో నిలువగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ సుధీర్‌రెడ్డి బరిలో నిలిచారు. సుధీర్‌రెడ్డి 1,24,201 ఓట్లు రాగా, రామసుబ్బారెడ్డికి కేవలం 72,856 ఓట్లు మాత్రమే వచ్చాయి. 51,345 ఓట్ల భారీ మెజార్టీతో సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. ఇద్దరూ ముఖ్య నేతలు ఒక్కటై  టీడీపీకి మద్దతు పలికినా వైఎస్‌ జగన్‌ చరిష్మా ముందు వారికి ఘోర పరాభవం తప్పలేదు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేక చతికిల  పడింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 90,110 ఓట్ల  అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు.

అసెంబ్లీ  విషయానికి వస్తే పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్‌  కుటుంబానికి ఓటమి లేదు. కడపలో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా 52,539 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, రాయచోటిలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి 32,679, రాజంపేటలో మేడా మల్లికార్జునరెడ్డి 29,990 మెజార్టీ, రైల్వేకోడూరులో కొరముట్ల శ్రీనివాసులు 34,510, మైదుకూరులో రఘురామిరెడ్డికి 29,674, కమలాపురంలో రవీంద్రనాథ్‌రెడ్డి 26,168, బద్వేలులో వెంకట సుబ్బయ్యకు 44,734, ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్‌రెడ్డి 43,148 ఓట్ల మంచి మెజార్టీలు  లభించాయి. ఇక కడప  పార్లమెంటునుంచి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి 3,80,976 ఓట్ల భారీ మెజార్టీ రాగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి 1,57,655 ఓట్ల మెజార్టీ లభించింది. ఈ మెజార్టీని చూస్తే టీడీపీకి నామమాత్రంగా కూడా ఓట్లు దక్కలేదని స్పష్టమవుతోంది.

గతంలోనూ పరాభవాల పరంపర.. 
గడిచిన ఎన్నికల ఫలితాలు చూసినా టీడీపీకి ఘోర పరాజయాలు తప్పలేదని స్పష్టమవుతోంది.  రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ తరపున శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 తర్వాత ఇక్కడ  టీడీపీ ఒక్కసారి కూడా గెలిచిన పరిస్థితి లేదు.  రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వరుసగా మూడుసార్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా విజయం సాధించగా 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. కడప నుంచి డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా వైఎస్సార్‌ సీపీ తరపున రెండుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. ప్రొద్దుటూరు  నుంచి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి రెండుమార్లు గెలుపొందగా 2009 తర్వాత ఇక్కడ టీడీపీకి వరుస ఓటములు తప్పడం లేదు.  కమలాపురం నుంచి పి.రవీంద్రనాథ్‌రెడ్డి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 తర్వాత ఇక్కడ టీడీపీకి విజయం లభించలేదు. మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి వరుసగా రెండుసార్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు.

జమ్మలమడుగు నుంచి వరుసగా రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. 1999 తర్వాత ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు. బద్వేలు  నుంచి రెండుసార్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయం సాధించగా, అంతకుముందు రెండుమార్లు సైతం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు  గెలుపొందారు. 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రమే ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత వరుస ఓటములు తప్పలేదు. ఈ ఫలితాలు చూస్తే టీడీపీ జిల్లాలో మరింత పతనమైన పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల ఓటమి అనంతరం ఆ పార్టీ క్యాడర్‌ నిర్వీర్యమై పోయింది. మొక్కుబడిగా కూడా నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కిందిస్థాయి క్యాడర్‌ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైంది.

జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న అరకొర నేతల మధ్య వర్గ విబేధాలు పతాక స్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లాకు చెందిన సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిలు టీడీపీని వీడి షెల్టర్‌ జోన్‌ బీజేపీలో చేరగా మిగిలిన నేతలు ఆ పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరమయ్యారు. దీంతో జిల్లాలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ›ప్రతిపక్ష నేత చంద్రబాబు సోమవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బాబు  ఎంత కసరత్తు చేసినా జిల్లాలో టీడీపీ మళ్లీ పుంజుకునే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement