సాక్షి, అమరావతి : టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత విడుదల చేశారు. అయితే, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉండి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన నేతలకు పెద్దపీట వేశారని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు ముగ్గురు కాంగ్రెస్ తాజా మాజీలకు ఎంపీలుగా అవకాశం కల్పించారని విమర్శిస్తున్నారు. కిశోర్ చంద్రదేశ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మీకి రాహుల్ కోటాలో టికెట్లిచ్చారని, పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేశారని మండిపడుతున్నారు.
ఇక ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ కోసం పనిచేసిన నేతలకు ఎంపీ సీట్లు కేటాయిస్తే.. బాబు మాత్రం కోట్లు కుమ్మరించే పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారులకు టికెట్లు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్త చేశారు. ఇదిలాఉండగా.. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడింది. నరసాపురంలో జనసేన అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ తరపున శివరామరాజును డమ్మీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పార్టీలో చేరకుండానే టికెట్..!
కాంగ్రెస్ నేత సబ్బం హరికి టీడీపీ భీమిలీ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. అయితే, తాను విశాఖ ఎంపీ సీటు కోరితే ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంలో మంత్రి గంటా కలగజేసుకుని ఆయనకు నచ్చజెప్పినా వెనక్కు తగ్గలేదు. మంగళవారం ఉదయం అమరావతి చేరుకున్న సబ్బం చంద్రబాబు వద్ద తన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గతకొంత కాలంగా ఆయన టీడీపీకి అనుకూలంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌తో సబ్బం తలపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment