
టీడీపీ అభ్యర్థి కందికుంట అనుచరుడి దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డా.పీవీ సిద్దారెడ్డి గన్‌మెన్
సాక్షి, కదిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డా.పీవీ సిద్దారెడ్డిపై గురువారం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ అనుచరుడు పోలింగ్ బూత్‌లోనే దాడికి దిగాడు. అడ్డుకున్న సిద్దారెడ్డి గన్‌మెన్ గిరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గన్‌మెన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలెట్టారు. దాడికి పాల్పడిన వ్యక్తి కందికుంట అనుచరుడు పాల హరి అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆయా బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది.
ఇలా ఆలస్యంగా మొదలైన వాటిలో పట్టణంలోని గొల్లమ్మ మండపం వద్ద ఉన్న 88వ పోలింగ్ బూత్ కూడా ఒకటి. సాయంత్రం 6 గంటల సమయంలో డా.సిద్దారెడ్డి ఆ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించారు. 6 గంటల తర్వాత కూడా మరో రెండు గంటలు పోలింగ్ నిర్వహించాలని టీడీపీ ఏజెంట్లు, ఆ పార్టీ నాయకులు సదరు పోలింగ్ కేంద్రంలో డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న డా.సిద్దారెడ్డి 6 గంటలకు అప్పటికే క్యూలైన్‌లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని, కానీ తర్వాత వచ్చే వారిని అనుమతించకూడదని డాక్టర్ సిద్దారెడ్డి తెలియజేశారు. ఆ సమయంలో కేవలం ఒక్కరు మాత్రమే క్యూలైన్‌లో ఉన్నారు. ఇందుకు పోలింగ్ కేంద్రంలోనే ఉన్న కందికుంట అనుచరుడు డా.సిద్దారెడ్డిపైకి దాడికి దిగాడు. అడ్డుకోబోయిన ఆయన గన్‌మెన్‌పై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గన్‌మెన్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చేతులెత్తేసిన పోలీసులు
టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పోలింగ్ సందర్భంగా రోజంతా ప్రతి పోలింగ్ కేంద్రంలోకి 100 మంది అనుచరులతో ప్రవేశించి అక్కడున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, ఆ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు. ఆయన పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశిస్తుంటే ఎక్కడా పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన అనుచరులు కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలోకి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోయినా లోనికి వెళ్తూ బూత్‌లో కూడా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు.