సాక్షి ప్రతినిధి, కర్నూలు: సంక్రాంతి పండుగకు ముందే జిల్లాలో ‘పందెంకోళ్లు’ రె‘ఢీ’ అయ్యాయి. వచ్చే ఎన్నికల బరిలో ఉండేది తామేనంటూ ఎవరికి వారు ధీమాగా చెబుతున్నారు. తామే గెలుపు కోళ్లమని కూడా ప్రకటించుకుంటున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీలో సీట్ల లొల్లి షురూ అయ్యింది. ప్రధానంగా కర్నూలు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో బరిలో ఉండేది ‘నేనే అంటే నేనే’ అంటూ పోటీపడుతున్నారు. కర్నూలు నియోజకవర్గంలో సర్వే ఆధారంగా తనకే సీటు వస్తుందని టీజీ భరత్ ప్రకటిస్తుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ప్రతి జన్మభూమి సభలోనూ వచ్చే సాధారణ ఎన్నికల్లో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ ప్రకటిస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
మరోవైపు సర్వే ఆధారంగా గెలుపు అభ్యర్థిని తానేనని, అందువల్ల తనకే సీటు వస్తుందని టీజీ భరత్ ఒక అడుగు ముందుకేసి చెబుతున్నారు. ఓడిపోయే అభ్యర్థికి సీటు ఇవ్వరంటూ పరోక్షంగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ సీట్ల పోరు కొత్త సంవత్సరం వేడుక సాక్షిగా మొదలయ్యింది. ఇక్కడ టీడీపీ తరఫున బరిలో నిలిచేది తానేనని భూమా నాగిరెడ్డి సన్నిహిత మిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా బలనిరూపణకు వేదికగా ఆయన నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. మంత్రి అఖిలప్రియ వద్దన్నప్పటికీ బలమేమిటో నిరూపించుకోగలగడం ద్వారా తానే పందెం కోడినని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేస్తున్నారు.
నేనంటే నేనే..!
కర్నూలు నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేస్తారంటూ ఓటర్లందరి ఫోన్లకు వాయిస్ మెసేజ్ పంపి సర్వే చేపట్టారు. ఇందులోనే ఎవరు మీ అభ్యర్థి అంటూ మొదటి నెంబరు టీజీ భరత్‌కు, రెండో నెంబరు ఎస్వీ మోహన్ రెడ్డికి కేటాయించడంతో అసలు పోరు మొదలయ్యింది. ఈ సర్వేతోనే సీటు గొడవ మొదలయ్యింది. గెలిచే అభ్యర్థి తానేనని, అందువల్ల సీటు తనకేనని టీజీ భరత్ స్పష్టం చేస్తున్నారు. అయితే, గత మూడు రోజులుగా ప్రతి జన్మభూమి సభలోనూ తానే కర్నూలు నుంచి పోటీ చేస్తానని, కొందరు కావాలని పత్తికొండ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇక ఆళ్లగడ్డలోనూ తాజాగా పోరు మొదలయ్యింది. నూతన సంవత్సర వేడుకల సాక్షిగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సీట్ల గొడవ ప్రారంభమైంది. తనకే అధిక బలం ఉందని నిరూపణ కోసం ఏవీ ప్రయత్నించారు. భూమా బంధువులు కూడా తన వెంటే నడుస్తారని చెప్పుకోవడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. మరోవైపు తన వర్గాన్ని కాపాడుకునే పనిలో మంత్రి అఖిలప్రియ నిమగ్నమయ్యారు. ఏవీ పార్టీకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసే పని చేశారు. మంత్రిగా, తన తండ్రి వారసురాలిగా తనకే సీటు అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సర్వే గుబులు!
ఇక అధికార పార్టీ నేతల్లో సర్వే గుబులు ప్రారంభమయ్యింది. మొదట్లో కేవలం కర్నూలు నియోజకవర్గంలోనే అభ్యర్థిపై సర్వే జరగగా... తాజాగా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఫోన్లు వస్తుండటం గమనార్హం. పోటీలో ఎవరు నిలబడితే గెలుస్తారో చెప్పాలంటూ ఐవీఆర్‌ఎస్ ద్వారా ఆయా నియోజకవర్గ ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయి. ఈ సర్వే ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారనే గుబులు అందరిలోనూ మొదలయ్యింది. సర్వే ఆధారంగా ఇస్తే తమ భవితవ్యం ఏమిటని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సంక్రాంతి సాక్షిగా ఎన్నికల పందెం కోళ్ల పోటీ ప్రారంభమయ్యిందన్నమాట!
Comments
Please login to add a commentAdd a comment